లాక్‌డౌన్ సమయంలో చుక్క మందు కోసం మందు బాబులు వెర్రెక్కిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో దుకాణాలు తెరవకముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు మందు బాబులు.

దాదాపు ప్రతి మద్యం షాపుల వద్ద కిలోమీటర్ల మేర వరుసలో నిలబడిన జనాల వీడియోలను ఎన్నో చూశాం. తాజాగా కర్ణాటకలో ఇదే రకమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే అది మద్యం దుకాణం ముందు కాదు.. ఓ రెస్టారెంట్ ముందు అది కూడా బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు.

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలో రెస్టారెంట్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. బెంగళూరు నగరానికి సమీపంలోని హోసకోటేలో ఆనంద్ రెస్టారెంట్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారనే సమాచారం అందడంతో బిర్యానీ ప్రియులు హోటల్‌కు పోటెత్తారు.

దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున వందల మంది క్యూ కట్టారు. దీనిని ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన వారు ‘‘ బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నారా ఏంటీ..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.