హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. కేంద్ర సచివాలయంలోని నార్త్ బ్లాక్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నారు.

ఉదయం 9.45 గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకునే ఆయన.. రాత్రి 10.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉంటున్నారు. మధ్నాహ్న భోజనం కూడా ఆఫీసులోనే కానిచ్చేస్తున్నారు.

దీంతో ఆయనతో పాటు ఇద్దరు సహాయ మంత్రులు, అధికారులు కూడా అప్పటి వరకు ఆఫీసులోనే ఉండాల్సి వస్తోంది. ఆయన వేగాన్ని అందుకోలేక అధికారులు సతమతమవుతున్నారు.

చివరికి పండుగ పూట కూడా ఆయన ఉదయాన్నే ఆఫీసుకు చేరుకుంటున్నారు. ప్రతిరోజు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతూ... అనేక ఇన్‌పుట్స్ సేకరించి... వాటిని తన జూనియర్ మంత్రులకు, అధికారులకు ఇస్తున్నారు.

గతంలో హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్ చాలా సమావేశాలు అధికారిక నివాసంలోనే నిర్వహించేవారు. మధ్యాహ్నం భోజనానికి సైతం ఇంటికి వెళ్లేవారు. ఒక్కోసారి తిరిగి వచ్చేవారు కాదు.. ఇంటి నుంచే పని చేసేవారు.

కానీ అమిత్ షా స్టైలే డిఫరెంట్. అమిత్ షా కార్యాలయం కేంద్రప్రభుత్వంలో అతిపెద్ద అధికార కేంద్రం. వివిధ సమస్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖులు హోంమంత్రిని కలిసి వెళుతుంటారు.

అమిత్ షా రాకతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర పరిమితంగా మారింది. గతంలో అన్ని కీలక వ్యవహారాలు దోవల్ చేతుల మీదుగా సాగేవి. అప్పుడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా ఉండటం వల్ల.. మంత్రి కాకపోవడం వల్ల దోవల్‌పైనే ప్రధాని నరేంద్రమోడీ ఆధారపడేవారు.

ఇప్పుడు అన్ని పనులు అమిత్ షా ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడు కూడా కావడంతో ప్రధాన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై హోంమంత్రిగా ఆయన మాటే కీలకమవుతోంది.

వీటికి తోడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తుండటంతో పార్టీ కార్యక్రమాలు సైతం షాయే పర్యవేక్షిస్తుండటంతో ఆయనకు కార్యక్రమాలు పెరిగిపోయాయి.