సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పలు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం ప్రత్యేకంగా నిలవబోతోంది.

దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఒక్క స్థానానికి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అనంతనాగ్ జిల్లా భారత్-పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌ లోయలోని ఈ ప్రాంతం ఉగ్రవాదులకు అడ్డా.

శాంతిభద్రతలతో పాటు ఇక్కడ ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే. భద్రతా సిబ్బందికి పొంచి వున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ స్థానంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

మొత్తం 6 లోక్‌సభ స్థానాలున్న కశ్మీర్‌లో 5 దశల్లో పొలింగ్ జరగనుంది. మరోవైపు ఝార్ఖండ్, ఒడిశాల్లో ఈ సారి 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో గరిష్టంగా 2 దశల్లోనే పోలింగ్ ముగిసేది.