న్యూఢిల్లీ: దేశంలో కట్టడి కాని కరోనా వైరస్ మహమ్మారి లోక్ పాల్ సభ్యుడు జస్టిస్ ఎకే త్రిపాఠీ ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా వైరస్ సోకి ఆయన మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. ఆయన ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. 

ఆయన కూతురుకు, వంటమనిషికి కూడా కరోనా వైరస్ సోకింది. అయితే, వారిద్దరు కోవిడ్ -19 నుంచి కోలుకున్నారు. ఛత్తీస్ గఢ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన త్రిపాఠీ ఎయిమ్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేరారు. ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. 

అవినీతి నిరోధ అంబుడ్స్ మన్ లోక్ పాల్ లోని నలుగురు జ్యుడిషియల్ సభ్యుల్లో త్రిపాఠీ ఒక్కరు. మార్చి 20వ తేదీన ఆయన చివరిసారి కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. లోక్ పాల్ సభ్యులంతా కిద్వాయ్ నగర్ లోని అదే అపార్టుమెంటులో ఉంటారు. దాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. 

భారతదేశంలో శనివారంనాడు అత్యధికంగా 2,411 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 3,776కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 1,223కు చేరుకుంది. శనివారంనాడు కొత్తగా 71 మరణాలు సంభవించాయి.