కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం ఇటీవల పునరుద్దరించబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం ఇటీవల పునరుద్దరించబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించబడిన కొద్ది రోజుల తర్వాత.. రాహుల్ గాంధీ బుధవారం రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. ఇక, ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడకముందు.. ఆయన ఇదే కమిటీలో సభ్యునిగా ఉన్నారు. 

ఇక, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం సాయంత్రం వివిధ పార్లమెంటరీ కమిటీలకు నలుగురు ప్రతిపక్ష ఎంపీలను నామినేట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా అదే కమిటీకి నామినేట్ అయ్యారు. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుపోషణ, ఆహార ప్రాసెసింగ్‌పై స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. రింకూ ఇటీవలే జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికలో విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించబడిన ఎన్‌సీపీకి చెందిన ఫైజల్ పీపీ మహమ్మద్ కూడా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీపై స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు.

ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే ఆయన లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఆయన తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. 

మరోవైపు రాహుల్ గాంధీ తన నేరారోపణను నిలిపివేయాలనే అభ్యర్థనతో పాటు సెషన్స్ కోర్టులో ఆ ఉత్తర్వులను సవాలు చేశారు. సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతని సవాలును వినడానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేసేందుకు సెషన్ కోర్టు నిరాకరించడాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ జూలై 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సూరత్‌ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించింది. సూరత్ కోర్టులోని ట్రయల్ జడ్జి రెండేళ్ల గరిష్ట శిక్ష విధించడానికి తగిన కారణాలను అందించలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.ట్రయల్ జడ్జి ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షను విధించారని.. శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే ఎంపీగా అనర్హత వేటు పడి ఉండేది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక, ఈ వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు, సోనియా గాంధీ నివాసం వెలుపల సంబరాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్ ఆగస్టు 7 నోటిఫికేషన్ విడుదల చేసింది.