ఆ దేశాల మొత్తం జానాభా కంటే భారత్ లో ఓటేసినవారే ఎక్కువ... లోక్ సభ ఎన్నికల రికార్డులు, విశేషాలివే..!!
లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.... 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు కొన్ని ప్రపంచ రికార్డులు సృష్టించాయి.. అవేంటంటే..
న్యూడిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల జాతర ముగిసింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపుకు అంతా సిద్దంచేసింది భారత ఎన్నికల సంఘం. జూన్ 4న అంటే రేపు ఈవిఎంలలో నిక్షిప్తమైన పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది... ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో గత రెండు నెలలుగా సాగిన లోక్ సభ ఎన్నికల ప్రక్రియ గురించి భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ సంచలన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికలు 2024 రికార్డులు, ఆసక్తికర విషయాలు :
1. భారత దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు వున్నారు. వీరిలో 49.7 కోట్లమంది పురుషులు, 47.1 కోట్లమంది మహిళలు వున్నారు. మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఈ స్థాయిలో ఓటర్లు లేరు.
2. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లలో చాలా చైతన్యం కనిపించిందని... స్వచ్చందంగా ఓటుహక్కును వినియోగించుకున్నారని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తంగా 64.2 కోట్ల మంది ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారని... మరే దేశంలోనూ ఈస్థాయిలో ఓటర్లు పాల్గొన్నది లేదన్నారు. కాబట్టి భారత్ ప్రపంచ రికార్డు సష్టించినట్లు సిఈసి తెలిపారు.
3. దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ ఓటర్ల సంఖ్య జీ7 దేశాల జనాభా కంటే 1.5 రెట్లు, యురోపియన్ యూనియన్ జనాభా కంటే 2.5 రెట్లు ఎక్కువ. యూఎస్ జనాభా కంటే మనదగ్గర ఓటేసిన వారే ఎక్కువ.
4. మహిళా ఓటర్ల విషయంలో కూడా భారత్ ది రికార్డే. మొత్తం 47.1 కోట్లమంది మహిళా ఓటర్లుంటే వారిలో 31.2 కోట్లమంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో మహిళలు ఏ దేశ ఎన్నికల్లోనూ పాల్గొన్నది లేదు.
5. ఏడు దశల్లో నిర్వహించిన ఈ లోక్ సభ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది, 68,000 పరిశీలకుల బృందాలు పాల్గొన్నాయి. నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు ఉపయోగించారు.
6. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చినతర్వాత దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడినట్లు ఈసి వెల్లడించింది. ఏకంగా 10వేల కోట్ల విలువైన నగదు, వస్తువులు, మద్యం, డ్రగ్స్ లభించినట్లు వెల్లడించారు.
7. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికల్లో గత రికార్డులన్నింటిని బద్దలుగొడుతూ ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారట. ఇక్కడ 58.58 శాతం పోలింగ్ నమోదయినట్లు ఈసి వెల్లడించింది.
8. ఏడు దశల్లోనూ పోలింగ్ చాలా ప్రశాతంగా జరిగినట్లు సిఈసి వెల్లడించారు. ఈసారి కేవలం 39 చోట్ల మాత్రమే రీపోల్ నిర్వహించామన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 540 చోట్ల రిపోలింగ్ నిర్వహించామని... దీంతో పోలిస్తే ఇది చాలా తక్కువని సీఈసి రాజీవ్ కుమార్ తెలిపారు.
9. ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థులిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఏపీలోని గుంటూరు లోక్ సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,706 కోట్లు, తెలంగాణలోని చేవెళ్ల లోక్ సభ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4,668 కోట్ల ఆస్తులతో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
10. దేశవ్యాప్తంగా 48 వేల ట్రాన్స్ జెండర్స్, 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు వున్నారు. ఇక 1.85 కోట్ల మంది కొత్తగా ఈసారే ఓటుహక్కును పొందారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా వున్నారు.