Lok Sabha Elections 2024 : యూరప్ మొత్తం జనాభా కంటే భారత ఓటర్లే ఎక్కువ... ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ టాప్ లో వుంది. మరి దేశంలో ఓటర్లు ఎంతమంది వున్నారో తెలుసా? భారత ఎన్నికల సంఘం చెప్పిన లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు.
న్యూడిల్లి : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగ షురూ అయ్యింది. భారత ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలు 2014 షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఈ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఓ ఆసక్తికర కామెంట్ చేసారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు భాగస్వామ్యం కానున్నారని తెలిపారు. అంటే మొత్తం యూరప్ జనాభా కంటే ఎక్కువమంది కేవలం మన ఎన్నికల్లో ఓటేయనున్నారన్న మాట. ఇది ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసే విషయం.
దేశంలోని ఓటర్లుకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలను సిఈసి వెల్లడించారు. 97 కోట్ల ఓటర్లలో 49 కోట్లమంది పురుషులు, 47 కోట్లమంది మహిళలు వున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోడానికి సిద్దంగా వున్నవారే 1.8 కోట్ల మంది వున్నట్లు ఈసీ తెలిపింది.
యువ భారతంతో యువ ఓటర్ల సంఖ్యే అధికంగా వుంది. దేశవ్యాప్తంగా ఓటుహక్కును కలిగివున్న 20-29 ఏళ్ల యువత 19.74 కోట్లమంది వున్నట్లు ఈసి తెలిపింది. అలాగే 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 82 లక్షలమంది వున్నారు. దివ్యాంగ ఓటర్లు కూడ 88 లక్షలకు పైగా వున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.