వ్యవసాయ చట్టాలపై లోక్‌సభలో గురువారం రగడ జరిగింది. సాగు చట్టాలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా మాట్లాడుతూ.. సాగు చట్టాలపై కాంగ్రెస్ గతంలో మార్పులు కోరిందన్నారు. మార్పులు కోరిన కాంగ్రెస్ ఇప్పుడు సాగు చట్టాలపై అభ్యంతరమా అని సింధియా నిలదీశారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా విపక్ష ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. దీంతో బుధవారం కూడా లోక్‌సభలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు ఎంత నచ్చచెప్పినా వినకపోడంతో వాయిదాల పర్వమే కొనసాగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సభా కార్యకలాపాలకు విపక్షాలు అడ్డుతగలడంతో తొలుత 4.30 గంటలకు, ఆ తర్వాత 5గంటల వరకు.. ఇలా పలుమార్లు సభ వాయిదా పడింది.

చివరకు రాత్రి 9గంటలకు మరోసారి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు.