ఆకతాయి చేసిన పని వల్ల నడి వంతెనపై ఆగిన రైలును నడిపేందుకు లోకో పైలట్ సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అత్యవసరమైతేనే అలారం చైన్ లాగాలని సూచించింది.  

మనం రైళ్లో వెళ్తున్నప్పుడు చైన్ లాగి బండిని (emergency chain) కొందరు ఆపుతూ వుంటారు. ఎమర్జెన్సీ కావొచ్చు.. లేదంటే ఆకతాయి పని కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వ్యవహారాల వల్ల రైల్వే శాఖకు , సిబ్బందికి, ప్రయాణీకులకు విలువైన సమయం వృథా అవుతుంది. తాజాగా అనవసరంగా ఓ వ్యక్తి చైను లాగడంతో నడి వంతెనపై రైలు ఆగిపోయింది. దీంతో లోకో పైలట్ (loco pilot) ప్రాణాలను పణంగా పెట్టి బండిని కదిలించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ముంబై నుంచి బీహార్‌లోని ఛప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లోని (godan express) ఓ ప్రయాణీకుడు ఎమర్జెన్సీ చైన్‌ను లాగాడు. దీంతో ముంబై నగరానికి 80 కి.మీ దూరంలోని తిత్వాలా - ఖడవలి స్టేషన్‌ల మధ్య ఓ నదిపై వున్న బ్రిడ్జిపై ఆగిపోయింది.

దీంతో రైలును మళ్లీ తిరిగి నడవాలంటే చైన్‌ను లాగిన బోగీ కింది అలారం చైన్ నాబ్‌ను రీసెట్‌ చేయాలి. దీనిలో భాగంగా అత్యంత ప్రమాదకర పరిస్ధితుల్లో బోగీ కింది పరికరాలు, చక్రాల పక్కన సన్నని సందులోంచి లోపలికి వెళ్లి సరిచేశారు ఆ రైలుకి అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రైల్వే శాఖ (indian railways) షేర్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించింది. 

‘‘అనవసరంగా అలారం చైన్‌ని లాగడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. అలారాన్ని రీసెట్‌ చేసేందుకు అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ సాహసం తీసుకున్నారు.. అందువల్ల అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే చైన్‌ని లాగాలని రైల్వేశాఖ ప్రయాణీకులను కోరింది. ఈ విషయం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ashwini vaishnaw) దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్‌ను ఆయన ప్రశంసించారు. నడి వంతెనపై , ప్రాణాలకు తెగించి సాహసం చేసిన సతీష్ కుమార్‌ను నెటిజన్లు సైతం కొనియాడారు. 

Scroll to load tweet…