కేరళలోని కొచ్చిలో ఓ డంప్ యార్డ్ లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పొగ వెలువడింది. దీంతో ప్రజలు మాస్క్‌లు ధరించవలసి వచ్చింది. లాక్‌డౌన్ లాంటి పరిస్థితి ఏర్పడాయి. ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

కేరళలోని కొచ్చిలో వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. నగరంలోని ప్రజలు వీధుల్లోకి రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావడం లేదు. ఒక వేళ బయటకు వచ్చినా.. ముఖాలకు ముసుగులు ధరించడం, శరీరం నిండా బట్టలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి కరోనా వైరస్ వల్ల కాదు.. మరేదో కొత్త వ్యాధి వ్యాప్తి వల్ల కాదు.. ఈ పరిస్థితికి కారణం నగరానికి సమీపంలోని ఓ డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడమే. డంపింగ్ యార్డులో మంటలు చేలారేగడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడటమేంటీ? ప్రజలు ఎందుకు అంతలా భయాందోళనలకు గురికావడమేంటని భావిస్తున్నారా..?

వివరాల్లోకెళ్తే.. గత వారం (మార్చి 2న) బ్రహ్మపురంలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం జరగడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 5000 లీటర్లకు పైగా నీటితో స్ప్రే చేసినట్లు సదరన్ నేవల్ కమాండ్ తెలిపింది. ఈ ప్రమాదం వల్ల వెలువడిన పొగ కొచ్చి నగరమంతా వ్యాపించింది. దాదాపు వారం రోజులైనా ఆ ప్రభావం తగ్గడం లేదు. అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రమాదం వల్ల కొన్ని విషపూరితమైన, ఘాటైన వాయువులు వెలువడినట్టు తెలుస్తోంది. ఈ విషపూరిత వాయువులు నగరంలో వ్యాపించడంతో నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయింది. 

దీంతో కొచ్చిలో పరిస్థితి కోవిడ్-19 లాక్‌డౌన్‌లా ఉంది. వీధుల్లో ప్రజలు రావడానికి కూడా భయపడుతున్నారు. బయట కనిపించిన వారు మాస్క్‌లు ధరించారు. పిల్లలు, వృద్ధులు బయటకు రావడం లేదు. పలు చోట్ల పొగలు కమ్ముకోవడంతో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చాలా మంది కళ్ళు, గొంతు మంట, చికాకుతో బాధపడుతున్నట్టు ఫిర్యాదు చేశారు.

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం 

ఈ పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలోనే బయటికి రావాలని, ఒక వేళ బయటకు వచ్చినా ఎన్‌95 మాస్క్‌లు వాడాలని కేరళ ప్రభుత్వం ప్రజలను కోరింది. పరిస్థితి సద్దుమణిగే వరకు ప్రజలు బయట జాగింగ్ చేయవద్దని సూచించింది. జిల్లా వైద్యాధికారి 24x7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం చేయాలని ఆరోగ్య శాఖలోని వైద్యులు,ఇతర ఉద్యోగులకు అప్రమత్తం చేసింది. ఇది కాకుండా.. కొచ్చి ,పొరుగున ఉన్న ఎర్నాకులంలో అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

50,000 టన్నుల వ్యర్థాలు అగ్నికి ఆహుతి

ఈ అగ్ని ప్రమాదం వల్ల కనీసం 50,000 టన్నుల చెత్త అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ.. తాము ప్రభావిత ప్రాంతంలోని 70 శాతం వెలువడే పొగను నియంత్రించగలిగాము. మిగిలిన 30 శాతం నుండి పొగను పూర్తిగా తొలగించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 

రంగంలోకి దిగిన నేవీ

ప్లాస్టిక్, మెటల్ , రబ్బరుతో సహా దాదాపు 50 వేల టన్నుల వ్యర్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో విషపూరిత పొగలు వెలువడు తున్నాయి. 200 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. నేవీ హెలికాప్టర్లను కూడా ఈ పనిలో మోహరించారు. అగ్నిమాపక శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. 70 శాతం మంటలను ఆర్పారు. మిగిలిన 30 శాతం ప్రాంతంలో పొగ నియంత్రణ పనులు కొనసాగుతున్నాయి.