న్యూఢిల్లీ:కరోనా రోగుల రికవరీ రేటు ఇతర దేశాలతో పోలిస్తే  దేశంలోనే అధికంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏడు మాసాల్లో ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించడం ఇది ఏడోసారి. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నామని ఆయన చెప్పారు.  పండుగల వేళ ఇళ్ల నుండి బయటకు వస్తున్నామని   ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

కరోనాతో ఇండియా సుదీర్ఘమైన పోరాటం చేస్తుందని చెప్పారు. అమెరికా, యూరప్  దేశాల్లో ఇంకా ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో 90 లక్షల మందికి బెడ్స్ ను రెడీగా ఉంచామని ఆయన తెలిపారు.త్వరలోనే దేశంలో పది కోట్ల కోవిడ్ టెస్టులను పూర్తి చేసుకోనున్నట్టుగా ఆయన తెలిపారు.

పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం ద్వారానే కరోనాను నియంత్రణలోకి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. అయినా కూడ ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన ప్రజలను కోరారు.కరోనా కట్టడిలో అగ్ర రాజ్యాల కంటే ఇండియా ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.  కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగామని ఆయన చెప్పారు. 

10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే వైరస్ ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా రోగుల మరణాలు కూడ ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో తక్కువేనని ఆయన తేల్చి చెప్పారు.

వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా పట్ల జాగ్రత్త ఉండాల్సిందేనన్నారు. వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నట్టుగా మోడీ తెలిపారు. ప్రతి ఒక్కరికీ కూడ వ్యాక్సిన్  అందించేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు.

మాస్కులు దరించకుండా బయటకు వస్తే మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టినట్టేనని  మోడీ  చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కూడ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.కరోనా తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతోందని ఆయన చెప్పారు. కరోనాతో ప్రమాదం లేదని అనుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.