దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో దాదాపు 10వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 2,66, 598 చేరినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 1, 29, 917 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.

కరోనా నుండి ఇప్పటి వరకు  1,29, 214 మంది కోలుకున్నారు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 7, 466 మంది మృతి చెందడం గమనార్హం. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 9, 987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 331మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే 5,119 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర కలవర పెడుతోంది. లాక్ డౌన్ 5లో ఇచ్చిన సడలింపులతో వైరస్ వ్యాప్తి మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఇక మహారాష్ట్ర పరిస్థితి అయితే.. మరింత దారుణంగా ఉంది. తాజా కేసులతో మహారాష్ట్ర.. పొరుగుదేశం చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 83,036 కేసులు నమోదు కాగా, అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ ఆరో స్థానంలో ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా 7,466 మంది మరణించగా..  ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య మూడు వేలకు పైగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల 35 వేల మంది కోలుకున్నారు. 

కాగా, 2,34,801 కేసులతో ఇటలీ ఏడో స్థానంలో ఉండగా.. 2,54,242 కేసులతో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 82 వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో, 30 వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 27 వేల కేసులతో ఢిల్లీ, 19 వేల కేసులతో గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.