మందు కోసం మందుబాబులు విపరీతంగా ఎగపడటంతో మద్యం దుకాణాల వద్ద ర‌ద్దీ ఏర్ప‌డింది. దీంతో సామాజిక దూరానికి భంగం వాటిల్లింది. 

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో నేటి నుండి మద్యం ధ‌ర‌లు తగ్గాయి. ఇంత‌వ‌ర‌కూ మ‌ద్యంపై విధించిన 70 శాతం కరోనా సెస్‌ను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే మద్యంపై వ్యాట్‌ను ఐదు శాతం పెంచింది. దీంతో ఇక‌పై మద్యం ధరల‌పై 25 శాతం వ్యాట్ వసూలు చేయయ‌నున్నారు. 

ఇప్పటి వరకు మద్యంపై 20 శాతం వ్యాట్ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ 3.0 సమయంలో ఢిల్లీలో మద్యం విక్ర‌యాలు ప్రారంభమయ్యాయి. మందు కోసం మందుబాబులు విపరీతంగా ఎగపడటంతో మద్యం దుకాణాల వద్ద ర‌ద్దీ ఏర్ప‌డింది. దీంతో సామాజిక దూరానికి భంగం వాటిల్లింది. 

త‌రువాత ఢిల్లీలో మ‌ద్యంపై 70 శాతం కరోనా సెస్‌ విధించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చ‌ర్య‌ తరువాత కూడా మ‌ద్యం దుకాణాల ముందు జ‌నం త‌గ్గ‌లేదు. మ‌రోవైపు ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే మద్యం విక్ర‌యాల స‌మ‌యంలో జనసమూహం ఉండ‌కుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్రాల్లో మద్యం రేట్లు బాగా పెంచారు. కాగా.. వారు కూడా ఇప్పుడు ధరలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.