రాజస్థాన్ లోని దిల్వారా జిల్లాలోని జైపూర్ కోట హైవేపై మంగళవారం 450 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల తో ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సంత్రామ్ మీనా గాయపడ్డారు. భారీ అగ్నిప్రమాదం సమీప ప్రాంతాల్లో భయాందోళనలకు దారితీసింది.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. గాయపడిన ట్రక్ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం డియోలి ఆస్పత్రికి తరలించారు. ఈ ట్రక్ నాసిరాబాద్ నుంచి కోట భవానిమండి వైపు వెళుతోంది. అగ్ని ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంటలు చెలరేగి డానికి కారణాలేమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే మంటలు చెలరేగిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగిందని జహాజ్‌పూర్ సిఐ మహావీర్ శర్మ తెలిపారు. అయితే స్థానికులు మాత్రం పిడుగు పడటం వల్లే మంటలు చెలరేగాయని  చెబుతున్నారు.  ఆ తర్వాత సిలిండర్లు పేలాయని పేర్కొన్నారు.

సుమారు మూడు గంటలపాటు సిలిండర్ల పేలుడు కొనసాగింది. ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారి 52 పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో, పోలీసు అధికారులు ప్రయాణికులను ఇతర మార్గాలు మళ్ళించారు.

కనీసం 5-7 కిలోమీటర్ల దూరం నుంచి మంటలు కనిపించాయని, ఎల్పిజి సిలిండర్ల పేలుళ్ల కారణంగా అగ్నిమాపక దళం అధికారులు కాలిపోతున్న ట్రక్కు దగ్గరికి వెంటనే చేరుకోలేక పోయినట్లు తెలుస్తోంది. 

స్పాట్ నుంచి  5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప గ్రామాల నుండి సిలిండర్ల ముక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 150 మీటర్ల దూరం దూరంలో ఉండటం కూడా కష్టమనిపించిందని ఒక అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.