Yerawada Jail: యావజ్జీవ ఖైదీ మిస్సింగ్.. ఎరవాడ జైలు నుంచి పరార్
పూణెలోని ఎరవాడ జైలు నుంచి కరుడుగట్టిన నేరస్తుడు పారిపోయాడు. సోమవారం ఉదయం ఖైదీలను అందరినీ లెక్కించగా.. ఆశిశ్ భరత్ అనే ఖైదీ కనిపించకుండా పోయాడు. దీంతో జైలు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబయి: మహారాష్ట్రలోని ఎరవాడ జైలు ఫేమస్. కట్టుదిట్టమైన భద్రత ఈ జైలుకు ఉన్నది. కానీ, అనూహ్యంగా కరడుగట్టిన ఓ నేరస్తుడు ఈ జైలు నుంచి పారిపోవడం చర్చనీయాంశమైంది. అంత కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని, అధికారుల కళ్లుగప్పి ఎలా పారిపోయాడా? అనే సందేహాలు వస్తున్నాయి.
పారిపోయిన ఖైదీని ఆశిశ్ భరత్‌గా గుర్తించారు. జైలు ట్యాగ్ సీ-949. ఆశిశ్ భరత్ గతంలో ఓ గ్యాంగ్‌స్టర్. పూణెలోని మావల్‌కు చెందిన ఆశిశ్ భరత్ 2008లో వార్జే మాల్వాడిలో ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులోనే పోలీసులు ఆశిశ్‌ను అరెస్టు చేశారు. పూణె కోర్టు ఆయనకు యావజ్జీవ ఖైదు శిక్ష విధించింది.
కొన్నాళ్ల తర్వాత ఆయనలో సత్ప్రవర్తన వచ్చిందని, కొంత మార్పు ఉన్నదని భావించి ఎరవాడ సెంట్రల్ జైల్ ఓపెన్ ప్రిజన్‌లోకి మార్చారు. ఇక్కడ ఆయనకు రేషన్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది. ఎప్పటిలాగే రోజూ తన పనిలో తాను ఉన్నట్టు అందరూ భావించారు. సోమవారం ఖైదీలు అందరినీ లెక్కించే వరకు ఆశిశ్ భరత్ పారిపోయినట్టు ఎవరికీ తెలియదు.
సోమవారం సాయంత్రం ఖైదీలను అందరినీ లెక్కించడం ప్రారంభించారు. ఒకరు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కనిపించకుండా పోయింది ఆశిశ్ భరత్ అని అధికారులు గుర్తించారు. వెంటనే జైలు ప్రాంగణమంతా జల్లెడ వేశారు. కానీ, ఎక్కడా ఆశిశ్ కనిపించలేదు. దీంతో జైలు నుంచి ఆశిశ్ పారిపోయినట్టు అధికారులు ఓ నిర్దారణకు వచ్చారు. వెంటనే సమీపంలోని ఎరవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.
జైలు నుంచి ఆశిశ్ ఎలా పారిపోయాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆశిశ్ ఒక్కడే స్వీయ శక్తులు, సామర్థ్యాలతో పారిపోయాడా? లేక జైలు లోపలి నుంచి ఎవరైనా లేదా బయటి నుంచి ఆయనకు ఎవరైనా సహకరించారా ? అనే కోణంలోనూ పరిశీలనలు చేస్తున్నారు.