Asianet News TeluguAsianet News Telugu

ఆయువు తీస్తున్న వాయుకాలుష్యం.. 9 ఏళ్ల జీవితం కోల్పోనున్నామా?

భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడమే కాదు, వారి ఆయుర్దాయం కరిగే ముప్పు ఉన్నది. దేశంలోని 40శాతం ప్రజలు తమ జీవితాలను తొమ్మిదేళ్లు కోల్పోనున్నట్టు అమెరికాలోని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కాలుష్య కారకాలను డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు లోబడేలా చేస్తే.. లేదా కాలుష్యాన్ని కట్టడి చేస్తే భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ప్రజల ఆయుష్షు 5.6ఏళ్లు పెరిగే అవకాశమూ ఉన్నదని తెలిపింది.

life expectancy may cut short by nine years in india due to air pollution cites a study
Author
New Delhi, First Published Sep 1, 2021, 12:47 PM IST

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం మనిషి ఆయువును తీసేస్తున్నది. ప్రపంచంలోనే వాయుకాలుష్య దేశాల్లో భారత ముందువరుసలో ఉన్నది. భారత రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే వరుసగా అత్యధిక కలుషిత నగరాల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్యం వల్ల భారత్‌లో ఆయుర్దాయం క్షీణిస్తున్నదని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. దేశంలోని 40శాతం మంది ప్రజలు తొమ్మిదేళ్ల జీవితాన్ని కోల్పోయే ముప్పు ఉన్నదని తెలిపింది. సుమారు 48 కోట్ల మందికి మృత్యువు తొమ్మిదేళ్లు స్పీడ్‌గానే కబళించనున్నట్టు వివరించింది. ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నట్టు ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్, చికాగో యూనివర్సిటీ అధ్యయనం అంచనా వేసింది.

మనిషి స్వచ్ఛమైన వాయువులు పీలిస్తే ఎంత కాలం జీవించవచ్చుననే అంశంపై ఈ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోని పరిస్థితులనూ పరిశీలించింది. 2019లోని వాయు కాలుష్య స్థాయిలు ఇకపైనా కొనసాగితే ఆ దేశంలో కాలుష్యం తీవ్రంగా పెరిగే ముప్పు ఉందని తెలిపింది. ఫలితంగా దేశంలో 48 కోట్ల మంది ప్రజలు తొమ్మిదేళ్ల ఆయుష్షును కోల్పోతారని వివరించింది. అంటే దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలు తొమ్మిదేళ్లు తమ జీవితాలను కోల్పోతారని పేర్కొంది. ఉత్తర భారతం, గంగాతీర కాలుష్య ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కుగా ఉంటుందని వివరించింది. కాగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోనూ కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉన్నది. ఈ రాష్ట్రాల్లో ప్రజలు 2.5ఏళ్ల నుంచి 2.9ఏళ్ల జీవితాన్ని కోల్పోయే ముప్పు ఉందని పేర్కొంది.

దక్షిణాసియా దేశాల్లో అత్యధిక జనాభా, కాలుష్యాల వల్ల వాయుకాలుష్యం వల్ల ప్రపంచం కోల్పోయే జీవిత సంవత్సరాల్లో 58శాతం ఈ రీజియన్‌లోనే ఉండనున్నట్టు స్టడీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఐదు కాలుష్య దేశాల్లో భారత్, పాకిస్తాన్,  బంగ్లాదేశ్, నేపాల్‌లున్నాయి. ఈ దేశాల్లో 2000 సంవత్సరం తర్వాత రోడ్డుపైకి ఎక్కే వాహనాలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని అధ్యయనం వివరించింది. అలాగే శిలాజ ఇంధనాల వినియోగమూ గరిష్టంగా ఉన్నదని తెలిపింది. 1998 నుంచి 2017నాటికి శిలాజ ఇంధనాల వినియోగం మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. పంట వ్యర్థాలను కాల్చడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతున్నట్టు వివరించింది.

వాయు కాలుష్య కారకాలు డబ్ల్యూహెచ్‌వో నిబంధనలకు లోపే వెలువడితే ఈ నాలుగు దేశాల్లో ప్రజల ఆయుర్దాయం 5.6 ఏళ్లు పెరిగే అవకాశమూ ఉన్నదని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios