బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ సహా మరో 13 మందిని హత్య చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.

బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. కన్నడ భాషలో ఈ లేఖను రాశారు. రాష్ట్రంలోని ప్రముఖులను జనవరి 29వ తేదీన హతమారుస్తామని ఆ లేఖలో ప్రస్తావించారు.

చావుకు సిద్దంగా ఉండాలనే బెదిరింపు ధోరణిలో ఈ లేఖను రాశారు. నిజగుణానందస్వామితో పాటు మరో 14 మంది పేర్లను ఈ లేఖలో ప్రస్తావించారు. 

కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, సినీ నటుడు చేతన్ కుమార్, మాజీ భజరంగ్ దళ్ నేత మహేంద్ర కుమార్, బీటీ లలితా నాయక్, మహేష్ చంద్రగురు, ప్రోఫెసర్ భగవాన్, మాజీ మీడియా అడ్వైజర్ దినేష్ అమీన్ మట్టు, జర్నలిస్ట్ అగ్ని శ్రీధర్, బృందా కరత్ ల పేర్లను ఈ లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖను ఆశ్రమానికి చెందిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు. మరో వైపు కర్ణాటక హోం శాఖ మంత్రి బస్వరాజ్ బొమ్మై  ఈ విషయంపై స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామికి భద్రతను పెంచినట్టుగా ఆయన చెప్పారు. 

ఈ విషయమై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా మంత్రి బొమ్మై చెప్పారు ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కేటాయించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ద రామయ్యకు కూడ భద్రతను కొనసాగిస్తున్నట్టుగా మంత్రి చెప్పారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు జడ్  కేటగిరి సెక్యూరిటీని కొనసాగిస్తున్నట్టుగా మంత్రి చెప్పారు.

ఇదిలా ఉంటే తనకు బెదిరింపులు వచ్చినట్టుగా మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్వీట్ చేశారు. వరుసగా కుమారస్వామి ట్వీట్లు చేశారు. ఇదే రాష్ట్రంలో గతంలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.