మార్కెట్‌లో నిమ్మకాయలు, పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, ఈ కఠిన పరిస్థితిని ఓ మొబైల్ షాప్ యజమాని తన వ్యాపారానికి అనుకూలంగా మలుచుకున్నాడు. తన షాప్‌లో మొబైల్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితం అని, యాక్ససరీస్ కొనుగోలు చేస్తే నిమ్మకాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించి సేల్స్ పెంచుకున్నాడు.
న్యూఢిల్లీ: మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు, పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ కలవరం పెడుతున్న సంగతి తెలిసిందే. వాహనాల్లో బయటకు వెళ్లాలంటే.. గతంలో కంటే ఇప్పుడు బడ్జెట్ రెట్టింపు చేసుకోవాల్సి వస్తున్నది. కేవలం ఇంధనం కోసమే ఇందులో సింహభాగం ఖర్చు అవుతున్నది. పెట్రోల్ ధరలతోపాటు కూరగాయల మార్కెట్‌లో నిమ్మకాయలూ భగ్గుమంటున్నాయి. రూ. 50 నుంచి రూ. 60లకే కిలో నిమ్మకాలు లభించేవి. ఇప్పుడు వీటి ధర రూ. 200 నుంచి రూ. 300 వరకు పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో వీటిపై సీరియస్ చర్చకు మించి ఫన్నీ కామెంట్లు, మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి.
ఈ ధరల పెరుగుదలనూ ఓ మొబైల్ షాప్ యజమాని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు. తమ దుకాణంలో మొబైల్ ఫోన్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని, మొబైల్ యాక్ససరీస్ కొనుగోలు చేస్తే నిమ్మకాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. దిస్ ఈజ్ బిజినెస్ అంటూ మీమ్స్ వదిలారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మొ బి వరల్డ్ యజమాని యశ్ జైస్వాల్ ఈ ఆఫర్ ప్రకటించాడు. రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన మొబైల్ ఫోన్ కొంటే లీటర్ పెట్రోల్ అందిస్తామని, అలాగే, మొబైల్ యాక్ససరీస్ కొనుగోలు చేస్తే రూ. 100 విలువైన నిమ్మకాయలను ఫ్రీగా ఇస్తామని ఆయన ఆఫర్ ఖరారు చేశాడు. అలాగే, ఈ ఆఫర్‌కు స్పందన కూడా మంచిగా వస్తున్నదని ఆయన నవభారత్ టైమ్స్ అనే మీడియా సంస్థకు వెల్లడించాడు. గతంతో పోలిస్తే ఈ ఆఫర్‌లు ప్రకటించిన తర్వాత సేల్స్ పెరిగాయని వివరించాడు. దీంతో ఈ రెంటి ధరలు ఒక వేళ తగ్గినా.. కూడా ఈ ఆఫర్‌ను ఇలాగే కొనసాగిస్తానని చెప్పాడు.
