నెల్లూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ సమీప బంధువు సిద్ధార్థ్ హత్య కేసులో చిక్కు ముడులు వీడడం లేదు. సిద్ధార్థ్ ను ఎందుకు హత్య చేశారని, ఆయనతో ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఆ పనికి ఎందుకు ఒడిగట్టారనేది తెలియడం లేదు. సిద్ధార్థ్ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.

శవం పూడ్చివేసిన చోట కేసులో రెండో నిందితుడు వినోద్ తో పోలీసులు సీన్ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏపీ పోలీసుల సహకారంతో కర్ణాటక పోలీసులు ఆ పని చేస్తున్నారు. శవాన్ని పూడ్చిన ప్రాంతాన్ని గుర్తించడానికి కూడా పోలీసులు అతన్ని తీసుకుని వెళ్లారు.  సిద్ధార్త్ ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.

హత్య కేసులో మరో నిందితుడు శ్యామ్ తిరుపతి సమీపంలో ఉరేసుకుని మరణించాడు. అతను సాఫ్ట్ వేర్ ఇంజనీరు. రెండో నిందితుడు వినోద్ కూడా తిరుపతికి చెందినవాడే. హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఇద్దరు కూడా విపరీతంగా మద్యం సేవించారు. మద్యం సేవించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. శ్యామ్ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. వినోద్ పట్టాలపై రైలుకు ఎదురుగా వెళ్లాడు. అయితే, అతని చేతులకు, కాళ్లకు దెబ్బ తగిలాయి. అతను మరణించలేదు. 

కర్ణాటక పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వినోద్ ను అదుపులోకి తీసుకున్నారు. భూవివాదాలకు సంబంధించిన వ్యవహారం ఈ హత్యకు దారి తీసిందా, లేదంటే సిద్ధార్థ్ తండ్రి రెండో భార్యకు సంబంధించిన వివాదం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తన ఇద్దరు భార్యల మధ్య గొడవలు లేవని, ఇద్దరు కలిసే ఉంటారని సిద్ధార్థ్ తండ్రి అంటున్నారు. అయితే, సిద్ధార్థ్ ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది చిక్కుముడిగానే ఉంది. సిద్ధార్థ్ కు వారిద్దరితో పరిచయం లేదని సమాచారం. పరిచయం లేని వ్యక్తులు ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎలా చంపారనే విషయాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.