తమిళనాట సంచలనం సృష్టించిన రెండు ఆకుల గుర్తు కేసులో కీలక సాక్షిగా వున్న లాయర్ గోపీనాథ్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. తన ఇంట్లో ఫ్యాన్ సీలింగ్‌కు ఆయన వేలాడుతూ కనిపించారు.
రెండు ఆకుల గుర్తు కోసం ముడుపుల కేసులో కీలక సాక్షిగా వున్న బీ గోపీనాథ్ (31) (gopinath) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన ఏప్రిల్ 8న ఈ కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. ఈ క్రమంలో గోపీనాథ్ బుధవారం తన నివాసంలోనే సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు.
ఈ కేసు విషయమై గోపీనాథ్‌కు ఈడీ అధికారులు మంగళవారం ఫోన్ చేశారు. ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో దర్యాప్తుకు హాజరుకావాలని చెప్పారు. దీంతో ఆయన తీవ్రమైన అలజడికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళారని.. బుధవారం తెల్లవారుజామున చూసేసరికి ఆయన సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారని వారు పోలీసులకు తెలిపారు. .
ఈ సమాచారం అందుకున్న తిరువేర్కడు పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని .. గోపీనాథ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ కిల్‌పౌక్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆయన నివాసంలో సూసైడ్ నోట్ కనిపించలేదని, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌లో ఆయనను సాక్షిగా హాజరుకావాలని కోరినట్లు తెలిసిందని, ఆయన ఆత్మహత్యకు కారణం ఇదేనా? లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గోపీనాథ్ తిరువేర్కడులోని సుందర చోళపురంలో ఉంటున్నారు. ఆయన మరో అడ్వకేట్ వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2017లో టీటీవీ దినకరన్ (ttv dhinakaran) నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీకి (AMMK) రెండు ఆకుల గుర్తును కేటాయించే విధంగా చేయడం కోసం సుకేష్ చంద్రశేఖర్‌తో చర్చలు జరిపినట్లు గోపీనాథ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సుకేష్ ఇప్పటికే అరెస్టయ్యారు.
గోపీనాథ్ తన సీనియర్ లాయర్ల ఆదేశాల మేరకు సుకేష్‌తో సంబంధాలు నెరపుతున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. 2017లో సుకేష్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తిరువేర్కడులోని గోపీనాథ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. సుకేష్‌ను ఈడీ అధికారులు గత వారం ప్రశ్నించి, వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా సుకేష్ చెప్పిన వారిని కూడా విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా టీటీవీ దినకరన్‌కు బుధవారం సమన్లు జారీ చేసి, ఢిల్లీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. అలాగే గోపీనాథ్‌ను సాక్షుల్లో ఒకరిగా చేర్చారు. ఈలోపే ఆయన ఆత్మహత్య చేసుకోవడం తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
