నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు కావడంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మరణశిక్ష అమలును ఆపేందుకు వారు చివరి నిమిషం వరకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో నలుగురు దోషులు ముఖేశ్ కుమార్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు శుక్రవారం తీహార్ జైలులో ఉరిని అమలు చేశారు.

ఇందుకోసం నిర్భయ తల్లిదండ్రులతో పాటు దేశంలోని ఆడపిల్లలు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఏడేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవీ విజయం సాధించారు. ఇది ఆమె ఒక్కరికే సొంతం కాదు.. ఆశాదేవి తరపున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది సైతం అలుపెరగకుండా శ్రమించారు.

Also Read:నిర్భయ కేసు: ఆ నలుగురు దోషుల సంపాదన ఎంతో తెలుసా?

దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుంటూ శిక్షను వాయిదా వేసుకుంటూ వచ్చిన దోషుల తరపు న్యాయవాది ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఆశాదేవిలో ధైర్యాన్ని నింపారు.

ఆమె పేరు సీమా ఖుష్వాహా. 2012లో అత్యాచారం జరిగిన నాటి నుంచి ఉరిశిక్ష అమలయ్యే వరకు సీమా న్యాయ పోరాటం సాగించారు. ఎఫ్ఐఆర్, దోషులపై ఛార్జ్‌షీట్ నమోదు కావడం తదితర విషయాలన్నింటిలోనూ సీమా ముద్ర కనిపించింది.

ఢిల్లీ హైకోర్టు, పటియాలా హౌస్ కోర్టు, సుప్రీంకోర్టులలో జరిగిన విచారణ సందర్భంగా సమర్థవంతంగా బాధితురాలి పక్షాన వాదించిన సీమా ఖుష్వాహా తన ఫీజు కింద ఒక్క పైసా కూడా తీసుకోలేదు.

Also Read:నిర్భయ కేసు: ఎప్పుడు ఏం జరిగిందంటే?

కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని ఆమె భావించింది. ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి అమలు కావడంతో సీమా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీమా ఖుష్వాహా.. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు.