తాగిన మత్తులో భార్యాపిల్లలను గన్ తో బెదిరించిన లాయర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలి పురంలో జరిగింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన ఒక లాయర్ (Lawyer). ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వ అనుమతితో ఓ గన్ (gun) తీసుకున్నారు. అయితే దానిని ప్రాణాల రక్షణ కోసం ఉపయోగించకుండా క్షణికావేశంలో భార్య, పిల్లలను బెదిరించడానికి వాడారు. వారు ఆయన వద్ద నుంచి తప్పించుకున్నారు. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ (jogulamba gadwal) జిల్లాకు చెందిన బానాల అజయ్ కుమార్ (banala ajay kumar) అనే లాయర్ వనస్థలిపురం (vanasthalipuram)లోని సీబీఐ కాలనీ (cbi colony)లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. అజయ్ కుమార్ 2002 నుంచి లాయర్ గా పని చేస్తున్నారు. గత ఏడాది ప్రాణ రక్షణ కోసం అని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఒక గన్ తీసుకున్నారు. అయితే కొంత కాలం నుంచి ఇంటికి వచ్చి భార్యా పిల్లలతో గొడవలు పడుతున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ కూడా గొడవ జరిగింది. అయితే ఈ సమయంలో అజయ్ కుమార్ భార్య రమాదేవి (ramadevi) పైకి ఆ గన్ ను గురిపెట్టారు. చంపేస్తానని బెదిరించారు. దీంతో ఇద్దరు పిల్లలు అడ్డుగా వచ్చారు. దీంతో వారిని కూడా చంపేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో భార్య, పిల్లలు కలిసి అజయ్ కుమార్ వద్దనున్న గన్ తీసుకున్నారు. అనంతరం అతడు కత్తి తీసుకొని వారిని చంపేస్తానని బెదిరించారు. అతడి వద్ద నుంచి ఎలాగోలా వారంతా తప్పించుకున్నారు. అనంతరం భార్య రమాదేవి ఈ నెల 20వ తేదీన వనస్థలిపురం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆ లాయర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.
