Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టుకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొత్త సందేశం.. పార్లమెంటులో ఆయన ఏమన్నారంటే?

సుప్రీంకోర్టుకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరో సందేశం ఇచ్చారు. న్యాయమూర్తుల నియామకంపై ఆయన మరోసారి మాట్లాడారు. దేశంలో పెండింగ్ కేసుల విషయంపై మాట్లాడుతూ, న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అని వివరించారు. న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను పంపించాలని తాను తరుచూ సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను కోరుతూ ఉంటానని పేర్కొన్నారు.
 

law minister kiren rijiju new message to supreme court in parliament
Author
First Published Dec 15, 2022, 8:20 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టుకు తాజాగా మరో సందేశం ఇచ్చారు. జడ్జీల నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి పరిమిత పాత్రనే ఉన్నదనే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తున్నదనీ అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్‌లో ఉండటంపై రాజ్యసభలో వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇది ఆందోళనకరమని అన్నారు. దీనికి ప్రాథమిక కారణంగా జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండటమే అని పేర్కొన్నారు. కేసుల పెండింగ్‌ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నదని తెలిపారు. కానీ, వాటిని నింపడంలో ప్రభుత్వానిది పరిమిత పాత్ర అని వివరించారు. కొలీజియం పేర్లు ఎంచుకుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో ఏ హక్కూ లేదని అన్నారు.

క్వాలిటీ, భారత బహుళత్వాన్ని ప్రతిబింబించేలా సరైన మహిళల ప్రాతినిధ్యం ఉండేలా నియామకాల కోసం న్యాయమూర్తుల పేర్లను పంపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను తాను తరుచూ కోరుతూ ఉంటానని వివరించారు. కానీ, ప్రస్తుతం నియామక వ్యవస్థ పార్లమెంటు సెంటిమెంట్‌ను ప్రతిఫలించట్లేదని తెలిపారు.

దీనిపై తాను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని, లేదంటే.. న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్టుగా ఉంటుందని వివరించారు. న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ హక్కు అని రాజ్యాంగ స్ఫూర్తి చెబుతున్నదని తెలిపారు. 1993లో ఇది మారిందని పేర్కొన్నారు.

నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ యాక్ట్‌ను 2014లో ప్రభుత్వం ముందుకు తెస్తే 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ ఎన్‌జేఏసీని కిరణ్ రిజిజు ప్రస్తావించారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మార్పులు చేసే వరకూ హై జ్యూడీషియల్ వేకెన్సీ సమస్య ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉంటుందని న్యాయ శాఖ మంత్రి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios