భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిలో భాగంగా ప్రజలు, గుర్తింపు పొందిన మత సంస్థలు తమ అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా లా కమీషన్ ఆఫ్ ఇండియా కోరింది. 

భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు గురించి గుర్తింపు పొందిన మత సంస్థలు, ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను కోరాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 10, 2016 నాటి ప్రశ్నాపత్రంతో పాటు 2018వ సంత్సరం మార్చి 19, మార్చి 27, ఏప్రిల్ 10లలో జారీ చేసిన పబ్లిక్ నోటీసులను పీఐబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచింది. 

ప్రజల నుంచి వస్తున్న స్పందనను గమనించిన లా కమీషన్ యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రజలు, మత సంస్థల ఆలోచనలను సేకరించాలని తాజాగా నిర్ణయించింది. ఆసక్తి వున్న తమ అభిప్రాయాలను నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల వ్యవధిలో “click here” లేదా ‘‘ memberecretary-lci@gov.in’’కి ఈమెయిల్ ద్వారా తమ సూచన, సలహా, అభ్యంతరాన్ని తెలియజేయవచ్చని సూచించింది. 

Scroll to load tweet…

యూనిఫాం సివిల్ కోడ్‌ అమలుపై సందిగ్ధత :

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుపై వస్తున్న ఊహాగానాలన్నింటినీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను అభ్యర్థించిందని అప్పటి న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. లా కమిషన్ నుండి అందిన సమాచారం ప్రకారం..యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన అంశాన్ని 22వ లా కమిషన్ పరిశీలనకు తీసుకోవచ్చని ఆయన తెలియజేశారు. అందువల్ల యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. 

ప్రస్తుత లా ప్యానెల్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ప్యానెల్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ప్రస్తుత లా ప్యానెల్ ఫిబ్రవరి 21, 2020న ఏర్పాటైంది, అయితే దాని చైర్‌పర్సన్, సభ్యులు గత ఏడాది నవంబర్‌లో అంటే ప్యానెల్ పదవీకాలం ముగియడానికి నెలల ముందు నియమించబడ్డారు. 21వ లా కమిషన్ యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ సమస్యల పరిశీలనను చేపట్టింది. విస్తృత చర్చల కోసం తన వెబ్‌సైట్‌లో "కుటుంబ చట్టం యొక్క సంస్కరణ" పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్‌ను అప్‌లోడ్ చేసింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానమే యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఒక్కటి.