ఆశ్రమ్ పాఠశాల వ్యవహారంలో సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది చాలా రోజులుగా చర్చలో నానుతున్న విషయమే అయినప్పటికీ తాజాగా రజనీ రాజకీయరంగ ప్రవేశానికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మరోసారి తెరమీదికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెడితే..  శ్రీ రాఘవేంద్ర విద్యా సంఘం కార్యదర్శి లతా రజనీకాంత్‌ స్థానిక గిండి ప్రాంతంలో వెంకటేశ్వర్లు, పూర్ణ చంద్రరావు అనే వ్యక్తులకు చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమ్‌ పేరుతో పాఠశాలను నడుపుతున్నారు. అయితే రజనీకాంత్‌కు ఆశ్రమ్‌ స్థల సొంతదారులకు మధ్య అద్దె విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. 

2018, ఆగస్టు నెలలో ఆశ్రమ్‌ స్థల సొంతదారులు, లతా రజనీకాంత్‌ మధ్య జరిగిన చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. 2020, ఏప్రిల్‌లో స్థలాన్ని ఖాళీ చేయడానికి లతా రజనీకాంత్‌ అంగీకరించారు. 

2020 డిసెంబర్ వచ్చినా ఆశ్రమ్‌ పాఠశాలను అక్కడ నుంచి తొలగించకపోవడంతో ఆ స్థల సొంతదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లతా రజనీకాంత్‌ తమకు రూ.2 కోట్లు అద్దె బకాయి చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా, తమ స్థలంలో ఆశ్రమ్‌ పాఠశాలను ఖాళీ చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 

చాలా కాలంగా విచారణలో వున్న ఈ కేసు మంగళవారం మరోసారి న్యాయమూర్తి సతీష్‌కుమార్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి 2021 ఏప్రిల్‌ నెలలోగా ఆశ్రమ్‌ పాఠశాలలో అక్కడ నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.అలా కాని పక్షంలో కోర్టు ధిక్కార కేసులో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ లతా రజనీకాంత్‌కు నోటీసులు జారీ చేశారు. 

దీంతోపాటు  2021–22 ఏడాదికి విద్యా విధానాన్ని కొనసాగించరాదని ఆదేశించారు. దీనికి  కరోనా వ్యాప్తి కారణంగా 2020 ఏప్రిల్‌ నెలలో ఆశ్రమ్‌ పాఠశాలను ఖాళీ చేయలేకపోయామని, అందుకు మరింత అవకాశం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, తమ కోరికను పరిగణలోకి తీసుకున్న కోర్టు 2021 ఏప్రిల్‌ వరకు ఆశ్రమ్‌ పాఠశాల ఖాళీ చేయడానికి అవకాశం కల్పించిందని లతా రజనీకాంత్‌ వర్గం పేర్కొన్నారు. అంతేకాని ఆశ్రమ్‌ పాఠశాల స్థల సొంతదారులకు తాము బకాయి ఉన్నామన్నది వాస్తవం కాదని, క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నామని వివరించారు.