New Delhi: దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసన స్థలంలో రెజ్లర్ల కోసం మడతపెట్టే పడకలను తీసుకువచ్చినందుకు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా నిరసన స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
Late-night chaos at Jantar Mantar-Wrestlers & Delhi Police: బుధవారం అర్థరాత్రి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు తమపై దాడి చేశారని, దూషించారని నిరసన తెలుపుతున్న అథ్లెట్లు ఆరోపించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. మాల్వియా నగర్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని నిరసన స్థలం నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా మడతపెట్టిన పడకలతో భారతి ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు అధికారిక ప్రకటనలో.. నిరసన మద్దతుదారులు ట్రక్కు నుండి పడకలను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అనంతరం పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోవడంతో సోమనాథ్ భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నిరసన స్థలం నుంచి మీడియాతో మాట్లాడిన రెజ్లర్ భజరంగ్ పూనియా నిరసనకారులకు యావత్ దేశం నుంచి మద్దతు అవసరమని అన్నారు. తమకు యావత్ దేశం మద్దతు అవసరమని, ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రావాలన్నారు. అలాగే, "పోలీసులు మాపై బలప్రయోగం చేస్తున్నారు, మహిళలను దూషించారని" పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై మైనర్ రెజ్లర్ తో సహా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఒలింపిక్స్ విజేతలతో సహా భారత రెజ్లర్లు రెండో దశలో భారీ నిరసనలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులతో ఘర్షణ అనంతరం రెజ్లర్లు విలేకరులతో మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ సింగ్ తీరును ఎత్తిచూపారు. ఫిర్యాదుదారుల్లో ఒకరు మైనర్ కావడంతో సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. పోక్సో చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైనర్ చేసిన ఆరోపణల ఆధారంగా ఈ కేసు నమోదైంది. గౌరవానికి భంగం కలిగించే సంబంధిత సెక్షన్ల కింద ఇతర ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు కోసం రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
