కరోనా నేపథ్యంలో మారటోరియం సమయంలో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీలు వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. రుణాలు తీసుకున్న వారిపై భారం పడకుండా ఒక నిర్థిష్ట విధానంతో రావాలని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులకు రెండు వారాల గడువు ఇచ్చింది.

ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ చివరి వారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యే వరకు ఆయా ఖాతాలను నిరర్థక ఆస్తులుగా పరిగణించరాదని సుప్రీం స్పష్టం చేసింది.

దీనిపై బ్యాంకులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుగుతున్నాయని కోర్టుకు కేంద్రం వివరించింది. మారటోరియంలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీన పరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి.

కరోనా వైరస్ కారణంగా రుణాల చెల్లింపులపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆ తర్వాత దానిని ఆగస్టు 31 వరకు పొడిగించింది. అయితే ఆ కాలంలోనూ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు వడ్డీని వసూలు చేయడం పట్ల సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.