జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పైచేయి సాధించాలని పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం లేదు. అయితే దాయాది దేశాన్ని ప్రపంచం పట్టించుకోవడం లేదు. దీంతో భారత్‌లో అలజడి రేపాలని భావిస్తున్న పాక్.. ఉగ్రవాదులను ఊసిగొల్పుతోంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వారణాసిలో ఉగ్రదాడి కోసం లష్కర్ తీవ్రవాదులు ఏకంగా భారీ శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం కొందరు ఉగ్రవాదులు కొద్దినెలలుగా వారణాసిలో రెక్కీ నిర్వహించారని..  మే 7 నుంచి 11 మధ్య లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని, నేపాల్‌కు చెందిన మరో ఉగ్రవాదితో కలిసి ఇక్కడే మకాం వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

వారణాసి ప్రాంతంలో లష్కరేను బలోపేతం చేయడంతో విధ్వంసానికి వీరు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఇంటెలిజెన్స్ .. స్థానిక పోలీసులను హెచ్చరించింది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.