లష్కర్ టాప్ టెర్రరిస్ట్ కమాండర్ హతం.. పీవోకేలోని అల్ ఖుదుస్ మసీదులో ఘటన
లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్ట్ కమాండర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హతమయ్యాడు. అతడు ప్రార్థనలు చేసేందుకు రావల్ కోట్ లోని అల్ ఖుదుస్ మసీదుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు అతడిని కాల్చి చంపారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్ట్ కమాండర్ హతం అయ్యారు. భారత్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న అతడిని రావల్ కోట్ లోని అల్ ఖుదుస్ మసీదులో గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింగా గుర్తించారు.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. కోట్లి నుంచి ప్రార్థనలు చేసేందుకు వచ్చిన రియాజ్ అహ్మద్ ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలపై కాల్చి చంపారు. కాగా.. జనవరి 1న జరిగిన ధంగ్రీ ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారిగా అతడు ఉన్నాడు. ఆ సమయంలో రాజౌరీ జిల్లాలోని ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. అక్కడ ఓ పేలుడు పదార్థానికి కూడా ఉగ్రవాదులు వదిలిపెట్టారు. దీంతో అది మరుసటి రోజు పేలింది.
ఈ ఏడాది సరిహద్దు వెంబడి కార్యకలాపాలు సాగిస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ హతమవడం ఇది నాలుగోసారి. జమ్మూ ప్రాంతానికి చెందిన ఈ టెర్రరిస్టు అహ్మద్ 1999లో సరిహద్దు దాటాడు. జంట సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీల్లో ఉగ్రవాద పునరుద్ధరణకు ఇతడే సూత్రధారి అని అధికారులు తెలిపారు.
మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్ నుంచి పనిచేసే అహ్మద్ ఇటీవల రావల్కోట్ కు మకాం మార్చాడు. లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్ కు అత్యంత సన్నిహితుడని, ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేవాడని అధికారులు పేర్కొన్నారు.