మన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత గొప్ప భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చిక్కులు వచ్చాయి. ఆ చిక్కుముళ్లను సుప్రీంకోర్టు పలుమార్లు విప్పుకుంటూ సరైన మార్గనిర్దేశనలు చేసింది. ఆ క్రమంలోనే చారిత్రక తీర్పులను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ తీర్పులను ఓ సారి చూద్దాం.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాల్సిన కాన్‌స్టిట్యూషనల్ బాడీ. అలాగే, రాజ్యాంగంలో కీలకమైన అంగం లెజిస్లేచర్. చట్టసభలు ఎప్పుడు హద్దులు దాటినట్టు కనిపించినా ఆ తప్పును సుప్రీంకోర్టు సరిదిద్దుతుంది. భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా నిలిచిన కొన్ని చారిత్రక తీర్పులను చూద్దాం.
ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం, 1950:
ఏకే గోపాలన్ ఓ కమ్యూనిస్టు లీడర్. 1950లో ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద ఆయనను మద్రాస్ జైలులో పెట్టారు. అప్పుడు ఆర్టికల్ 32 ఆధారంగా హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి తన నిర్బంధాన్ని ఏకే గోపాలన్ పరీక్షించారు. సెక్షన్లు 7, 8, 10, 11, 12, 13, 14లు ఆర్టికల్ 13, 19, 21లను అతిక్రమిస్తున్నాయని ఆయన వాదించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఒక స్వతంత్ర కోడ్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సిస్టమ్ రూపొందించిన చట్ట వ్యవస్థ కింద గోపాలనర్‌ను నిర్బంధించారని తెలిపింది. ఒక వేళ రాజ్యం చట్ట ప్రకారం రూపొందించిన వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ నిర్బంధించినప్పుడు ఆ వ్యవస్థ ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, సెగ్మెంట్ 14ను సుప్రీంకోర్టు తొలగించింది. ఇది కీలక హక్కులను ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని అభిప్రాయపడింది. అంతేకాదు, ఆ రిట్ పిటిషన్ తొలగిస్తూ.. ఏకే గోపాలన్ నిర్బంధం చట్టబద్ధమేనని వివరించింది.
కేశవానంద భారతి వర్సెస్ కేరళ, 1973:
భారత న్యాయవ్యవస్థలో కేశవానంద భారతి కేసుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 1970లో ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఎదినీర్ మఠానికి కేశవానంద భారతి చీఫ్. ఆయన పేరిట కొన్ని భాగాలుగా భూమి ఉన్నది. అప్పుడే అప్పటి కేరళ ప్రభుత్వం భూసంస్కరణల చట్టం 1969ని అమలు చేసింది.
ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో అతిపెద్ద ధర్మాసనం విచారించింది., 7:6 రేషియోతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో రాజ్యాంగం మౌలిక స్వభావం, దాని సుస్థిరత్వానికి బీజాలు వేసింది. పార్లమెంటు చట్టానికి రాజ్యాంగంలోని ఏ భాగమైన సవరించడానికి అర్హమేనని పేర్కొంది. ప్రాథమిక హక్కులు సహా అన్నింటిని పార్లమెంటు సవరించగలదని తెలిపింది. అయితే, ఏ సవరణ చేసినా.. రాజ్యాంగ మౌలిక స్వభావం, దాని ప్రాథమిక నిర్మాణం కోల్పోకుండా ఉండాలని వివరించింది. ఈ నిర్మాణాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మార్చలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పు భారత ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చిందని, భారత రాజ్యాంగానికి స్పిరిట్ ఇచ్చిందని చెబుతుంటారు.
మేనకా గాంధీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, 1977:
ఇందిరా గాంధీ కోడలు మేనకా గాంధీ పాస్‌పోర్టును 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ చర్యను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌లో తీర్పు ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకించలేదు కానీ, పౌర స్వేచ్ఛకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛ పౌరులు తప్పక కలిగి ఉంటారని స్పష్టం చేసింది. ఇది ప్రాథమిక హక్కుల కేసులకు ఎప్పుడూ ఒక దిక్సూచీలో ఉంటుంది. ఈ కేసును ఇప్పటి వరకు 215 సార్లు సుప్రీంకోర్టు ఉల్లేఖించిందంటే దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ కాలంలో సుప్రీంకోర్టుపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాని చట్టబద్ధతను నొక్కి చెప్పడానికి ఈ తీర్పు చాలా ఉపకరించినట్టు న్యాయకోవిదులు చెబుతుంటారు.
ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, 1994:
జనతా దళ్ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎస్ఆర్ బొమ్మై 1988 ఏప్రిల్ 13 నుంచి 1989 ఏప్రిల్ 21వ తేదీ వరకు సీఎంగా చేశారు. 1989 ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఆర్టికల్ 356ను ఉటంకిస్తూ రాష్ట్రపతి నిలిపేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపు లేదా రాష్ట్రపతి పాలనను తెచ్చారు. ఇది సాధారణంగా ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసే ఎత్తుగడ వంటిది. రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. తమ ప్రభుత్వాన్ని తొలగించడాన్ని సవాల్ చేస్తూ బొమ్మై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే సంపూర్ణ అధికారం రాష్ట్రపతికి ఉండదని సుప్రీంకోర్టు తేల్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటి వరకు రాష్ట్ర శాసన సభను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది.
నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం 2018:
ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటికి చెందిన నవతేజ్ సింగ్ జోహర్, మరో ఐదుగురు ఐపీసీలోని సెక్షన్ 377ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2016లో రిట్ పిటిషన్ వేశారు. 2018 సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను రద్దు చేస్తూ ఐదు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.
ఎల్జీబీటీ కమ్యూనిటి సభ్యుల మధ్య ఇరువురి అంగీకారంతో సంగమించడాన్ని, కలిసి జీవితాన్ని పంచుకోవడాన్ని అనుమతించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని వివరించింది. వారికీ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే, సేమ్ సెక్స్‌ను డిక్రిమినలైజ్ చేసింది. అంటే ఇది నేరపూరితం కాదని పేర్కొంది.
ఇంద్రసాహ్ని, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, ఇతరులు:
ఇంద్రసాహ్ని 1993లో అప్పటి నర్సింహా రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కేసు వేశారు. ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 10 శాతం రిజర్వేషన్ మాత్రమే ఇస్తున్నదని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌తో సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లను గరిష్టంగా 50 శాతానికి పెంచింది.
