Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య తీర్పు చారిత్రాత్మకం.. రాజ్ నాథ్ సింగ్

ఇది చారిత్రక తీర్పు అని తాను నమ్ముతున్నాను అని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించి, గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలు పాటించాలని కోరారు. 

Landmark Judgement: Union Minister Rajnath Singh on Ayodhya Verdict
Author
Hyderabad, First Published Nov 9, 2019, 12:33 PM IST

ఎన్నో సంవత్సరాలుగా దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న అయోధ్య వివాదానికి నేడు పులిస్టాప్ పడింది. వివాదాస్పద స్థలాన్ని సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికే కేటాయించింది. కాగా... మసీదు నిర్మాణానికి ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెల్లడించింది.

కాగా.. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అయోధ్య  రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందిచారు. 

ఇది చారిత్రక తీర్పు అని తాను నమ్ముతున్నాను అని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించి, గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలు పాటించాలని కోరారు. 

 

ఇదిలా ఉండగా... యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 


 అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios