తన ఇంట్లో అద్దెకు వుండే వ్యక్తికి చెందిన స్టార్టప్‌లో ఇంటి ఓనర్ పెట్టుబడి పెట్టాడు. బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం దేశంలో సాధారణ పట్టణాల నుంచి మహా నగరాల వరకు అద్దె ఇళ్లకు గీరాకి మామూలుగా లేదు. అనుకూలమైన ప్రాంతంలో, అన్ని వసతులు వుంటే ఎంత అద్దె చెల్లించేందుకైనా జనం వెనుకాడటం లేదు. అందుకే చాలా మంది ఇళ్లను నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చి రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇక భారత ఐటీ రాజధానిగా ఖ్యాతి తెచ్చుకున్న బెంగళూరు నగరంలో ఇప్పుడు విచిత్ర పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం టెక్ కంపెనీలు లే ఆఫ్‌లను ప్రకటిస్తూ వుండటంతో నగరంలోని ఇంటి యజమానులకు కొత్త భయాలు పట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు.

మరోవైపు.. టెక్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు... ఇళ్ల యజమానులు పెట్టే కఠినమైన షరతులను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వైరల్ పోస్ట్‌లు అద్దెదారుల పరిస్ధితిని తెలయజేస్తున్నాయి. ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే IIT, IIM డిగ్రీలు వుండాలని డిమాండ్ చేస్తున్నారు ఇంటి యజమానులు. దేశంలోని పరిస్ధితుల నేపథ్యంలో వారు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ గుప్తా అనే అద్దెదారు బెటర్‌హాఫ్ స్టార్టప్ కోసం ఇంటి యజమాని నుంచి 10 వేల డాలర్లు సేకరించిన తర్వాత కొన్ని స్టార్టప్ కంపెనీలకు కొత్త ఐడియా వచ్చింది. 

గుప్తా ఏమని పోస్ట్ చేశారంటే.. సింగిల్స్ కోసం ఏఐ ద్వారా నడిచే ఫస్ట్ మ్యారేజ్ సూపర్ యాప్‌లో ఇంటి యజమాని 10 వేల డాలర్లు పెట్టుబడి పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వాట్సాప్ చాట్‌లో ఇంటి యజమాని.. తాను మీ స్టార్టప్‌లో పెట్టుబడి పెడుతున్నానని చెప్పాడు. దీనికి పవన్ ఆల్ ది బెస్ట్ .. మీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నానని రిప్లయ్ ఇచ్చాడు. ఆ సందేశంలోనే తాను బెటర్‌హాఫ్ స్టార్టప్‌లో 10 వేల డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నాడు. కఠినమైన వ్యాపార పరిస్ధితుల్లో నేను ఊహించని పెట్టుబడిదారుని నా యజమానిలో కనుగొన్నానని పవన్ ట్వీట్‌ చేశారు. బెంగళూరు నగరంలో వ్యవస్థాపక స్పూర్తిని చూసి ఆశ్చర్యపోయా.. దీనికి కారణం లేకపోలేదు.. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పవన్ పేర్కొన్నారు. 

పోస్ట్ చేసిన వెంటనే ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు దీనికి పాజిటివ్‌గా స్పందిస్తూ.. పవన్, సుశీల్‌లకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇది మంచి వార్త అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో #peak Bengaluru moment వైరల్ అయింది. బెంగళూరులో హౌస్ హంటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ, గౌతమ్ అనే వ్యక్తి ఇంటి యజమానితో జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. అతను (ఇంటి యజమాని) తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, తన గురించి వ్రాతపూర్వకంగా అడిగాడని గౌతమ్ చెప్పాడు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. ఇందిరా నగర్‌లో 12వ రోజు ఇంటి వేట అని రాసి వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌ను జత చేశాడు. 

Scroll to load tweet…