గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వీరిలో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరూ ముందు నుంచి సైనికుడిగా మారి దేశానికి సేవ చేయాలనుకుంటారు.

కానీ ఈయన మాత్రం ముందు ఉగ్రవాదిగా పనిచేసి తర్వాత జవానుగా మారాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన నజీర్ అహ్మద్ వనీ గతంలో ఓ ఉగ్రవాది. 1990లలో ఉగ్రకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన తర్వాత తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకుని దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.

పోలీసులకు లొంగిపోయిన వనీ.. 2004లో టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరారు. అప్పటి నుంచి సైన్యానికి ఎంతగానో సేవ చేశారు. ఆయన సేవలకు మెచ్చిన రక్షణ శాఖ 2007, 2018లో సేవా పతకాన్ని బహుకరించింది.

గతేడాది నవంబర్‌లో షోపియాన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ సమయంలో ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

టెర్రరిస్టులను అంతం చేసేందుకు తన ప్రాణాలను అర్పించిన అహ్మద్ వనీ ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయనకు సైన్యంలోని అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించనుంది. రేపు ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అహ్మద్ వనీ భార్యకు అశోక్ చక్ర అందజేయనున్నారు.