ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

మరో రెండు నెలల తర్వాత మళ్లీ కొత్తగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. కాగా, బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ... డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరుగుతోంది.

ఈ కేసుకు సంబంధించి జాయింట్‌ అఫిడవిట్‌, లాలూ జ్యుడీషియల్‌ కస్టడీ పత్రాలను సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై గత నెల 12న విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ 2017 డిసెంబర్‌ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.  

ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి విషమించడంలో ఆయన్ను రాంచీలోని రిమ్స్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ కిడ్నీలు పనిచేయడం లేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు పేర్కొన్నాడు. దీంతో లాలూ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన తండ్రిని మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 50వేల పోస్టు కార్డులను పంపారు.