ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో బీహార్ మాజీ సిఎం లాలూ యాదవ్‌ను మంగళవారం సీబీఐ నాలుగు గంటల పాటు విచారించింది. రబ్రీ దేవిని ప్రశ్నించిన మరుసటి రోజు సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా ప్రశ్నించింది.

ఇప్పటికే వివిధ అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ సిఎం , రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను తాజాగా సీబీఐ ఓ అవినీతి కేసు విచారణలో భాగంగా లాలూను ప్రశ్నించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ మంగళవారం (మార్చి 7) నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. కాగా.. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

లాలూ ప్రసాద్‌ను ప్రశ్నించడంపై ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. లాలూ కూతురు కేంద్రాన్ని హెచ్చరించారు. తన తండ్రిని నిత్యం వేధిస్తున్నారని తెలిపారు. వారికి ఏదైనా జరిగితే.. తాను ఎవరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.

లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీలో ట్వీట్‌ చేశారు. 'మీరు నాన్న గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇవన్నీ గుర్తుండిపోతాయి. కాలం చాలా శక్తిమంతమైనది. ఇది గుర్తుంచుకోవాలి. నా తండ్రికి ఇప్పుడు 74 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ ఢిల్లీలో అధికార పీటాన్ని గడగడలాడించే సత్తా ఆయనలో ఉంది. ప్రస్తుతం సహనం పరీక్షలు ఎదుర్కొంటున్నది’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు .

గత నెలలో సింగపూర్‌లో లాలూకు కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో తన పెద్ద కుమార్తె మీసా భారతి ఇంట్లో లాలూ యాదవ్ ఉన్నారు. కాగా.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో లాల్ దర్యాప్తుకు సంబంధించి రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ మంగళవారం (మార్చి 7) నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ బస చేస్తున్న ఇండియా గేట్ సమీపంలోని పండారా పార్క్‌లోని లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి నివాసానికి ఉదయం 10.40 గంటలకు ఐదుగురు సీబీఐ అధికారుల బృందం రెండు కార్లలో వచ్చింది. దర్యాప్తు సంస్థ బృందం మధ్యాహ్నం 12.55 గంటల ప్రాంతంలో భోజనానికి వెళ్లింది. మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో ప్రశ్నోత్తరాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఈ కేసులో లాలూ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం (మార్చి 6) ప్రశ్నించింది. పాట్నా నివాసంలో రబ్రీ దేవిని సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కిడ్నీ మార్పిడి తర్వాత అతను ఒంటరిగా నివసిస్తున్న గదిలో కొన్ని పత్రాలను చూపించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. 

మార్చి 15న కోర్టు సమన్లు 

 ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో లాలూ ప్రసాద్ కు మార్చి 15 న కోర్టుకు హాజరు కావాలని సమన్లు ​​పంపింది సీబీఐ. 2004-2009 మధ్య కాలంలో లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. లాలూ యాదవ్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ గతేడాది ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.