రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే లాలూకు కిడ్నీ ఇచ్చేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయన కిడ్నీ మార్పిడి చేయించాలని నిర్ణయించారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. తన కిడ్నీలలో ఒకదానిని తండ్రి ఇవ్వాలని రోహిణి నిర్ణయం తీసుకున్నారు. 

అయితే ఈ ప్రతిపాదనకు లాలూ ప్రసాద్ యాదవ్ తొలుత అంగీకరించలేదని సమాచారం. తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే లక్ష్యంతో రోహిణి ఒత్తిడి చేయడంతో ఇందుకు ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ దానం ద్వారా సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. 

రోహిణి ప్రస్తుతం సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుంది. నవంబర్ 20-24 మధ్య లాలూ మళ్లీ సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని.. ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు అనుమతితో లాలూ ప్రసాద్ యాదవ్ సింపూర్ వెళ్లాల్సి ఉంటుంది.

ఇక, గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడికి సంబంధించిన సలహా ఇవ్వలేదు. కోర్టు అనుమతి తర్వాత సింగపూర్ వెళ్లిన లాలూకు పలు వైద్య పరీక్షలో చేయించడంలో రోహిణి కీలకంగా వ్యవహరించారు. అయితే లాలూకు పలు అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయించాని సూచించారు. దీంతో తన తండ్రికి కిడ్నీ ఇచ్చేందుకు రోహిణి సిద్దమయ్యారు. సింగపూర్‌లో పరీక్షల అనంతరం లాలూ తిరిగి ఇండియాకు వచ్చేశారు. 

ఇదిలా ఉంటే.. రోహిణి ఆచార్య సింగపూర్‌లో నివాసం ఉంటున్నప్పటికీ.. బీహార్‌లోని రాజకీయ సంఘటనలను నిశితంగా గమనిస్తూనే ఉంటారు. తన రాజకీయ అభిప్రాయాలకు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుంటారు. అంతేకాకుండా ఆర్జేడీ వ్యతిరేకులపై కూడా విమర్శలు చేస్తుంటారు.