Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur case: అశిష్ మిశ్రా బెయిల్ రద్దు.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దైంది. 

Lakhimpur Kheri Violence union minister Ajay Mishra son Ashish Mishra bail cancelled
Author
New Delhi, First Published Apr 18, 2022, 10:55 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దైంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వారం రోజుల్లోగా లొంగిపోవాలని అశిష్ మిశ్రాను ఆదేశించింది. వివరాలు.. గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో ఆశిష్ మిశ్రా కీలక నిందితునిగా ఉన్నాడు. ఈ కేసులో అశిష్ మిశ్రాను అక్టోబరు 9న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. 

అశిష్ మిశ్రా బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ లఖింపూర్‌లో చోటుచేసుకున్న హింసలో చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరయ్యాక ఈ కేసులో సాక్షిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిషన్‌పై అన్ని పక్షాల విన్న సుప్రీం ధర్మాసనం.. ఏప్రిల్ 4వ తేదీన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. సోమవారం (ఏప్రిల్ 18) రోజున సుప్రీం ధర్మాసనం.. తన నిర్ణయాన్ని వెలువరించింది. అశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది.. విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించబడింది’’ అని సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇటువంటి క్రిమినల్ విచారణ ప్రక్రియలో బాధితులకు హద్దులేని భాగస్వామ్య హక్కు ఉంది’’ అని జస్టిస్ సూర్య కాంత్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పదునైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు అనేక అసంబద్ధమైన పరిగణనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుందని.. ఎఫ్‌ఐఆర్‌కు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత పరిశీలనలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది.

ఇక, Lakhimpur Kheri‌లో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి  Ajay Mishra కుమారుడు  అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios