లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. లఖింపూర్ ఖేరి హింసలో నలుగురు రైతులు చనిపోయారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి (Lakhimpur kheri) ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (central minister ajay mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish mishra) బెయిల్ పై మంగళవారం బయటకు వచ్చారు. లఖింపూర్ ఖేరీలో హింసాత్మక వాగ్వాదం మధ్య నలుగురు రైతులను చంపిన కేసులో ఆశిష్ మిశ్రాను గతేడాది అక్టోబర్‌లో అరెస్టు చేశారు. టికోనియాలో రైతుల ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
లఖింపూర్ ఖేరీ జైలు సూపరింటెండెంట్ పీపీ సింగ్ (pp singh) తెలిపిన వివరాల ప్రకారం.. అలహాబాద్ హైకోర్టు (alahabad high court) ప్రకటించిన బెయిల్ షరతులను అంగీకరించిన తరువాత, ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిన తరువాత జైలు నుంచి విడుదల అయ్యాడు. మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చి వాహనంలో కూర్చున్న ఫొటోలు ఆయన ఆన్ లైన్ లో విడుదల చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని కలుసుకునేందుకు ఇంటికి చేరుకునే సమయంలో తీసిన ఫొటోలు కూడా విడుదల అయ్యాయి.
2021 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల నిరసనలు చేపట్టారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారును రైతుల మీద నుంచి తీసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతరం జరిగిన ప్రతీకార హింసలో ముగ్గురు బీజేపీ (bjp) కార్యకర్తలు మరణించారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు (journalist) కూడా మృతి చెందాడు. ఈ ఘటన ఆ సమయంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనిపై అన్ని రైతు సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు వెళ్లువెత్తాయి.
ఈ లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళనల చేస్తున్న రైతులపై కుట్రపూరితంగానే, ప్రణాళికబద్దంగానే రైతులపై కారెక్కించారని సిట్ పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఆశిష్ మిశ్రాను విచారణకు పిలిచింది. అయితే అతడు విచారణకు సహకరించకపోవడం, ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో గతేడాది అక్టోబర్ 9న సిట్ (sit) అతడిని అరెస్టు చేసింది. అతనితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత మందిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది.
కాగా.. గతేడాది కేంద్ర ప్రభుత్వం మూడు నూతన సాగు చట్టాలు తీసుకొచ్చింది. ఇవి రైతులకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని తెలిపింది. అయితే దీనిపై రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేయకపోగా.. మరింత నష్టాన్ని చేకూరుస్తాయని తెలిపింది. వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చివరికి రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ చట్టాల రద్దు కోసం సుధీర్ఘ పోరాటం చేసింది. ఈ క్రమంలోనే లఖింపూర్ ఘటన చోటు చేసుకుంది. రైతులు పట్టు వీడకపోవడంతో చివరికి కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
