Asianet News TeluguAsianet News Telugu

లఖింపూర్ ఖేరీ కేసు: 8 మంది రైతుల ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్

New Delhi: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కేంద్ర మంత్రి కారును రైతుల పైకి పోనిచ్చి 8 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన‌ ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బెయిల్ లభించింది. ఆశిష్ మిశ్రాకు కోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
 

Lakhimpur Kheri case: Union minister Ajay Mishra Theni's son Ashish Mishra granted bail
Author
First Published Jan 25, 2023, 1:54 PM IST

Lakhimpur Kheri-Minister's Son Gets 8-Week Bail: 2021లో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఎనిమిది వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆశిష్ మిశ్రా బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ లేదా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నివసించలేడు. వారం రోజుల్లోగా ఉత్తర్ ప్రదేశ్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, సాక్షులను ప్రభావితం చేయడానికి ఆశిష్ మిశ్రా లేదా అతని కుటుంబం చేసిన ఏదైనా ప్రయత్నం అతని బెయిల్ రద్దుకు దారితీస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే..  ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి  కారును పోనిచ్చి 8 మంది ప్రాణాలు బ‌లిగొన్న కేసులో నిందితుడైన‌ కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆశిష్ మిశ్రాకు కోర్టు 8 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆశిష్ మిశ్రా తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయడంతో పాటు తన లొకేషన్‌ను కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.  జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జనవరి 25న ఈ తీర్పును వెలువరించింది.

ఢిల్లీ-యూపీలో నివసించడాన్ని నిషేధించారు

బెయిల్ వ్యవధిలో ఆశిష్ మిశ్రా యూపీ లేదా ఢిల్లీలో నివసించలేరు. బెయిల్ పొందిన వారం రోజుల్లో యూపీ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన ఎక్కడ ఉండాలనే దానిపై పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసినా లేదా కేసును త‌ప్పుదారి ప‌ట్టించే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఈ బెయిల్‌ను తిరస్కరించవచ్చున‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 

శాంతియుతంగా నిర‌స‌న తెలిప‌న రైతులను కారుతో తొక్కించి చంపాడు.. 

అక్టోబర్ 3, 2021 న టికునియా పట్టణంలోని లఖింపూర్ ఖేరీలో హింస జరిగింది. శాంతియుతంగా వివాదాస్ప‌ద మూడు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో ఆశిష్ మిశ్రా ఎస్ యూవీ వారిపై పొనిచ్చారు. ఇక్క‌డ చోటుచేసుకున్న హింస కార‌ణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో రైతులు, ఒక జర్నలిస్ట్, ఇద్ద‌రు రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. అయితే, ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌డం, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రావ‌డంతో అధికార యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటూ కేంద్ర మంత్రి కుమారుడు అజ‌య్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసుల‌ అరెస్టు చేశారు.

ఈ క్ర‌మంలోనే తనకు బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. అయితే, బ‌ల‌మైన బీజేపీ నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రిగా ఉన్న అజ‌య్ మిశ్రా త‌న కుమారుడు, నిందితుడైన ఆశిష్ మిశ్రాను ర‌క్షించ‌డానికి బాధిత కుటుంబాల‌తో పాటు సాక్షుల‌ను బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని రైతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఈ కేసులో దర్యాప్తు బృందం సీజేఎం కోర్టులో 14 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. థార్ వాహనం ఢీకొని రైతులు నలిగి చనిపోయారని, ఈ వాహనంలో ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్నారని దీనిపై ఏర్పాటైన క‌మిటీలు సైతం పేర్కొన్నాయి. నేరం రుజువైతే తప్ప నిందితుడిని నిరవధికంగా జైల్లో పెట్టడానికి వీల్లేదని గతవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ ను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ ఇది సమాజానికి భయంకరమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు. ఆశిష్ మిశ్రా తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ఏడాదికి పైగా కస్టడీలో ఉన్నాడనీ, విచారణ ఎలా సాగుతోందో చూస్తే మరో ఏడెనిమిదేళ్లు పట్టొచ్చని వాదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios