లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటన కేసులో అశిష్ మిశ్రాకు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టు కమిటీ తెలిపింది.  దీంతో ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ లఖింపూర్ ఖేరీ ఘటన గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. దీంతో క‌మిటీ చేసిన ఈ సిఫార్సు వివ‌రాల‌ను సుప్రీం కోర్టు ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది. వ‌చ్చే సోమ‌వారంలోగా బెయిల్ ర‌ద్దు విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని కోరింది. 

లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెనీ కుమారుడు ఆశిష్ మిశ్రా టెనీ బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆశిష్ మిశ్రా బెయిల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌డం లేద‌ని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ వ్యాఖ్య‌లు చేసింది. 

ఫిబ్రవరిలో ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాధిత కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. “దేశం, ప్రపంచం మొత్తం ఆందోళ‌న రేకెత్తించిన లఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌లో నిందితులు మూడు నెలల్లో బెయిల్ పొందారు. అందరూ దీనిని చూస్తున్నారు.” అని మిశ్రాకు బెయిల్ మంజూరు అయిన వెంట‌నే, దానిని నిరసిస్తూ రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు.

హింసాకాండలో ప్రధాన నిందితులకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఓ క‌మిటీని నియ‌మించింది. బెయిల్ ర‌ద్దుపై సిఫార్సులు అంద‌జేయాల‌ని కోరింది. దీంతో మంగ‌ళ‌వారం ఆ క‌మిటీ రిపోర్టును అంద‌జేసింది. బెయిల్‌ను ఇప్పటికే బాధిత కుటుంబాలు వ్యతిరేకించాయి.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గతేడాది అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతులు నిరస‌న తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రికి చెందిన వాహ‌నాల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో ఇద్దరు బీజేపీ నాయ‌కులు, ఓ డ్రైవ‌ర్ చ‌నిపోయారు.

ఈ హింసాకాండ ఘ‌ట‌న‌లో అశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ బెయిల్ ను స‌వాలు చేస్తూ గ‌త నెల 21వ తేదీన బాధితుల బంధువులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ముద్దాయి చేసిన దారుణమైన నేరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదించారు. చార్జిషీటులోని నిందితుడిపై ఉన్న బలమైన ఆధారాలు, ఆయన హోదా, పొజిషన్ వంటివి తమకు ఆందోళనకరంగా ఉన్నాయని పిటిషన్‌లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి. ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పారిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయాన్ని అడ్డుకోవడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోపించారు. ఇదే కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప‌లు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యుల‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త కల్పించాల‌ని ఆదేశించింది.