నీటి కుంటలో బంగారం పడేశారనుకొని.. గ్రామస్థులంతా కలిసి నీటి కుంటలో నీరు మొత్తం తోడి కింద పారపోసారు. అయితే.. సదరు మహిళ చెప్పిందంతా తప్పుడు సమాచారమని తెలుసకునే సరికి కుంటలో నీరంతా ఖాళీ అయ్యింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కర్ణాటక రాష్ట్రం రామనగర్‌ జిల్లా బిళుగుంబ గ్రామంలో భగవంత అనే రైతు భార్య సవితా ఈ నెల 9న నీటికుంట వైపు వెళ్లారు. అప్పటికే ఇంట్లో గొడవలు ఉండడంతో గ్రామస్థులు ఆరా తీయగా ఇంట్లోని సుమారు 250 గ్రాముల నగలను బాక్సులో పెట్టి కుంటలో పడేశానన్నారు. ఇక అంతే.. ఆ  ఆభరణాల కోసం గ్రామస్థులు మోటార్ల్లు ఏర్పాటు చేసి కుంటలోని నీరు దాదాపు ఖాళీ చేశారు. 

ఈలోగా సమాచారం చేరడంతో అధికారులు అక్కడికొచ్చి నీటిని తోడే ప్రక్రియను ఆపేశారు. అయితే చావుకబురు చల్లగా అన్నట్లు.. నగలపెట్టెను కుంటలో పడేయలేదని సవితా తాపీగా సెలవిచ్చింది. దీంతో గ్రామస్థులు ఆమెపై రుసరుసలాడుతూ వెనుదిరిగారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.