తమిళనాడు: వరుసకు మరదలిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. బంధువులను కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రేమకు యువతి అంగీకరించలేదు. ప్రేమను తిరస్కరించింది. దీంతో కుటుంబ సభ్యులు వేరో యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. 

ఘనంగా నిశ్చితార్థం కూడా చేశారు. తనకు దక్కని ఆ అమ్మాయి వేరొకరికి దక్కకూడదన్న ఉన్మాదంతో రెచ్చిపోయాడు. అమ్మాయి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదాన్ని నింపాడు.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పాపనాశం శివాలయం ప్రాంతానికి చెందిన వసంత ప్రియ(25) కుంభకోణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. ఆమెను మేనమామ కుమారుడు నందకుమార్(34) ప్రేమ పేరుతో వెంటపడేవాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచాడు.

అతని ప్రేమను నిరాకరించిన ఆ యువతి వలంగైమానైకు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయం చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా అక్టోబర్ 28న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వచ్చే జనవరిలో పెళ్లి చేయాలని ఇరువర్గాలు నిర్ణయించారు. 

ఇంతలో వసంతప్రియ కుంభకోణం కావేరి నది ఒడ్డున గురువారం సాయంత్రం హత్యకు గురైంది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులను ఆరా తీశారు. తమ దగ్గర బంధువు నందకుమార్ యువతిని ప్రేమ పేరుతో వేధించినట్లు తెలిపారు.

దీంతో ఆయువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. వసంత ప్రియను తానే హత్య చేసినట్లు యువకుడు అంగీకరించాడు. వసంతప్రియను తాను ఎంతగానో ప్రేమించానని ఆమె తనను కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో తట్టుకోలేక కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలిపారు. 

మరో రెండు నెలల్లో పెళ్లికూతురుగా అత్తారింటికి సాగనంపాల్సిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కూతురును పొట్టనపెట్టుకున్నాడంటూ నందకుమార్ ను తిట్టిపోస్తున్నారు.