ఇంజనీర్, ఇన్నోవేటర్ సోనమ్ వాంగ్‌చుక్ తనను లడఖ్‌లోని తన ఇన్‌స్టిట్యూట్‌లో గృహనిర్బంధంలో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే స్థానిక పోలీసులు ఆ అభియోగాన్ని ఖండించారు.

ఇంజనీర్, ఇన్నోవేటర్ సోనమ్ వాంగ్‌చుక్ తనను లడఖ్‌లోని తన ఇన్‌స్టిట్యూట్‌లో గృహనిర్బంధంలో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే స్థానిక పోలీసులు ఆ అభియోగాన్ని ఖండించారు. 18,380 అడుగుల ఎత్తైన ఖర్దుంగ్ లా పైభాగంలో ఐదు రోజుల నిరాహార దీక్ష నుంచి మాత్రమే ఆయనను నియంత్రించినట్టుగా పేర్కొన్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 3 ఇడియట్స్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాంగ్‌చుక్.. లడఖ్ ప్రజల డిమాండ్లపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దృష్టిని ఆహ్వానించడానికి సేవ్ లడఖ్ పేరుతో జనవరి 26న ఖర్దుంగ్ లా వద్ద నిరాహార దీక్షను ప్రకటించారు. ఈ దీక్ష సోమవారం (జనవరి 30) రోజుతో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం.. తనిఖీ చేయని పారిశ్రామిక, వాణిజ్య విస్తరణ నుంచి పర్యావరణ రక్షించాలనేది వాంగ్ చుక్ డిమాండ్లలో ప్రధానమైనది. 

2019 ఆగస్టులో ఈ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇచ్చిన తర్వాత రాష్ట్ర హోదా, రాజ్యాంగ భద్రతలను ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక, తనను గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ఆర్టికల్ 244 ప్రకారం హిమాలయాలు, హిమానీనదాలు, లడఖ్, దాని ప్రజలను రక్షించడానికి నేను ఐదు రోజుల వాతావరణ ఉపవాసం ప్రకటించాను. నా భద్రత కోసం పోలీసులను మోహరించినట్లు మొదట నాకు చెప్పబడింది. లేకపోతే నేను తీసుకోకపోయేవాడిని’’అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

Scroll to load tweet…

అయితే వాంగ్‌చుక్ వాదనలను పోలీసులు ఖండించారు. ‘‘ఖార్దుంగ్ లా పాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నందున ఐదు రోజుల నిరాహార దీక్ష చేయడానికి అతనికి (వాంగ్‌చుక్) పరిపాలన అనుమతి ఇవ్వలేదు’’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-లేహ్ పీడీ నిత్య అన్నారు. అతని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ క్యాంపస్‌లో ఉపవాసం పాటించవలసిందిగా అభ్యర్థించినట్టుగా తెలిపారు. ఎందుకంటే ఆయన, ఆయన అనుచరులు ఆ ప్రదేశానికి (ఖర్దుంగ్ లా) వెళ్లడం చాలా ప్రమాదం అని చెప్పారు. ఖర్దుగ్ లా వైపు వెళ్లేందుకు వాంగ్‌చుక్ ప్రయత్నించినప్పుడు అడ్డుకున్నారని.. తిరిగి రావాలని అభ్యర్థించినప్పుడు ప్రతిఘటన చూపడంతో ఆయనను చట్టబద్దమైన చర్య కింద ఇన్‌స్టిట్యూట్‌కు తిరిగి తీసుకురావడం జరిగిందని తెలిపారు. 

‘‘వ్యవస్థ పోలీసులను దుర్వినియోగం చేస్తోంది. వారికి నా భద్రతపై ఎలాంటి ఆందోళన లేదు. వారి భద్రత కోసమే ఇదంతా చేస్తున్నారు. లడఖ్ ప్రజల సమస్యలు, ఆందోళనలను పరిష్కరించడంలో కేంద్రపాలిత ప్రాంత పరిపాలన ఘోరంగా విఫలమైనందున వారు నా గొంతును క్యాంపస్‌కు పరిమితం చేయాలనుకుంటున్నారు’’ అని వాంగ్‌చుక్ ఆరోపించారు. ఇక, ఆదివారం రోజున ట్విట్టర్‌లో చేసిన పోస్టులో.. ‘‘ప్రపంచానికి శుభోదయం! భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం లడఖ్‌ను రక్షించడానికి నా క్లైమేట్ ఫాస్ట్‌లో 4వ రోజు. రేపు జనవరి 30న నా ఉపవాసం చివరి రోజైన మీరందరూ నాతో చేరవచ్చు. లడఖ్, మీ సొంత పరిసరాలకు సంఘీభావంగా మీరు మీ ప్రాంతంలో ఒక రోజు ఉపవాసం నిర్వహించవచ్చు’’అని పేర్కొన్నారు. 

ఇక, లేహ్ జిల్లాలోని అల్చి సమీపంలోని ఉలేటోక్‌పోలో జన్మించిన 56 ఏళ్ల వాంగ్‌చుక్.. ఉత్తర భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో అభ్యాస వ్యవస్థల సమాజ-ఆధారిత సంస్కరణల కోసం రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్నారు. తద్వారా లడఖ్‌లోని యువత జీవిత అవకాశాలను మెరుగుపరిచారు.