Asianet News TeluguAsianet News Telugu

పాడుబడ్డ ఇంటిలో బంగారు నాణేలు.. రూ. 1.25 కోట్లు విలువైన 86 కాయిన్స్ లభ్యం.. ఆ లేబర్ నుంచి సమాచారం లీక్

మధ్యప్రదేశ్‌లో శిథిలమైన ఓ పాడుబడ్డ ఇంటిలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ ఇంటిని పునర్నిర్మిద్దామని కార్మికులను పనికి పంపగా.. వారికి ఈ నాణేలు దొరికాయి. తొలుత వారు పంచుకోవాలని అనుకున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారిని అరెస్టు చేశారు. నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
 

labours found antique gold coins while cleaning dilapidated house in madhya pradesh
Author
First Published Aug 29, 2022, 7:48 PM IST

భోపాల్: గుప్త నిధుల అన్వేషణ గురించి మనం కథల్లో వింటాం. కొన్నిసార్లు ఈ చర్చను నిజంగా కూడా వింటూ ఉంటాం. నిజంగా గుప్త నిధుల కోసం అన్వేషణలు వర్తమానంలో జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ.. కొందరు కార్మికులకు ఎలాంటి కష్టం లేకుండా మరెలాంటి ప్రయత్నం లేకుండా నిధులు అందివచ్చాయి. అప్రయత్నంగానే అదీ.. ఓ పాడుబడ్డ ఇంటిలో గుప్తంగా ఉన్న బంగారు నిధులు వారి చేతికి అందాయి. పాడుబడ్డ ఇంటిలో ఏముంటుంది అని వారూ అనుకున్నారు. కాబట్టే.. నిధుల ఆలోచనలేవీ లేకుండా కేవలం ఆ ఇంటి పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నారు. వారెవ్వరూ ఊహించని రీతిలో ఆ శిథిలమైన నివాసంలోనే రూ. 1.25 కోట్ల విలువైన 86 బంగారు నాణేలు వారి కంట పడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో ఇది వెలుగు చూసింది.

అదనపు ఎస్పీ దేవేంద్ర పాటిదార్ వివరాల ప్రకారం, ధర్ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంటిని పునర్నిర్మించాలని ఆ ఇంటి యజమాని భావించాడు. ఇందులో భాగంగా చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను తొలగించడానికి ఎనిమిది కార్మికులను పనికి మాట్లాడాడు. వారు ఆ ఇంటిలో చెత్తను తీసివేస్తుండగా పురాతనమైన 86 బంగారు నాణేలు లభించాయి. వాటిని చూడగానే వారి కళ్లు మెరిసిపోయాయి. 

ఈ నిధుల గురించి బయట ఎవరికీ చెప్పకుండా వారిలో వారు పంచుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్ని రోజులపాటు ఆ విషయం బయట ఎవరికీ తెలియలేదు. అయితే, ఆ ఎనిమిది మందిలో ఒక కార్మికుడు మద్యపానం సేవించి మత్తులో ఈ బంగారు నాణేల గురించి బయట వాగాడు. తాను ఓ నాణేన్ని రూ. 56 వేలకు అమ్మేశానని గొప్పలకు పోయాడు. తద్వార ఇంటి ఖర్చులన్నీ తీర్చుకుని సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫోన్ కొనుక్కున్నానని వివరించాడు. కానీ, తాను తాగిన మత్తులో మాట్లాడిన విషయం పోలీసుల దాకా
వెళ్లుతుందని అప్పుడు ఆ లేబర్ అనుకోలేదు.

ఈ విషయం తెలియగానే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్మికులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇప్పటి వరకు 86 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ బంగారు నాణేల గురించి ఇంటి యజమానికి తెలియదు. తన పురాతన ఇంటిలో నాణేలు దాగి ఉన్నాయనే విషయం ఆయన ఎరుకలో లేదు. స్వాధీనం చేసుకున్న ఆ బంగారు వస్తువుల మార్కెట్ విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇవి పురాతనమైనవి కాబట్టి, ఆర్కియలాజికల్ విలువ సుమారు రూ. 1.25 కోట్లు పలుకుతుందని వివరించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఈ విషయం సంచలనంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios