కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దంటూ బీజేపీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ తమ పార్టీ నేతలను కోరారు. రాజకీయాల్లో ఇతరులపై చేసే విమర్శలు ప్రజలు మెచ్చేవిధంగా  ఆరోగ్యకరంగా ఉండాలని ఆమె సూచించారు.

 ఇటీవల తమిళనాడులో పర్యటించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ, నాగ్‌పూర్‌ టౌజర్‌ వాలాలతో తమిళనాడు భవిష్యత్తు నిర్ణయించలేరంటూ విమర్శించారు.

దీనిపై బీజేపీ ఐటీ విభాగానికి చెందిన నిర్మల్‌కుమార్‌.. సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి హసీనా సయ్యద్‌ నేతృత్వంలో స్థానిక మధురవాయల్‌లో ఇటీవల పెద్దఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో సొంత పార్టీ అయినప్పటికీ నిర్మల్‌కుమార్‌ వ్యాఖ్యలను ఖుష్బూ గురువారం ఖండించారు. మహిళలను గౌరవించాలే కానీ వారిపై వ్యక్తిగత విమర్శలు చేయరాదని సూచించారు. తాను డీఎంకే, కాంగ్రె్‌సల్లో ఉన్నప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని వ్యతిరేకించానని గుర్తు చేశారు. 

తెలంగాణా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలోనూ తాను రాజకీయ పరంగా విమర్శలు చేశానే తప్ప, వ్యక్తిగతమైనవి కాదని ఖుష్బూ పేర్కొన్నారు.