ప్రయాగరాజ్ కుంభమేళాపై పరీక్షలు...20 ప్రశ్నలు, 100 మార్కులు
ప్రయాగరాజ్ మహా కుంభ్ 2025 కోసం పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహిస్తున్నారు. విపత్తు నిర్వహణ, ట్రాఫిక్, భక్తులతో వ్యవహారం వంటి అంశాలపై పరీక్షలు జరుగుతాయి. ఈ ఏర్పాట్ల ఉద్దేశ్యం ఏమిటి?
ప్రయాగరాజ్ మహా కుంభమేళా : యోగి ప్రభుత్వం ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 నిర్వహణకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తోంది. ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలను ఫాలో అవుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే కుంభమేళా విధుల్లో పాల్గొనే పోలీసులకు శిక్షణ, పరీక్షల ద్వారా నైపుణ్యం పెంచేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల సన్నద్ధతను పరీక్షించి, ఏ సవాళ్లనైనా ఎదుర్కొనేలా సమర్థవంతంగా వుండేలా ప్రత్యేక శిక్షణా సెషన్లు, పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కుంభమేళాకు వచ్చే పోలీసులను పూర్తిగా సిద్ధం చేసేందుకు వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారి సన్నద్ధతను పరీక్షించేందుకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్పీ కుంభమేళా రాజేష్ కుమార్ ద్వివేది ప్రకారం... కుంభమేళా విధులకు వచ్చే అందరికీ తప్పనిసరి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి భద్రత, విపత్తు, ప్రవర్తనా అంశాలపై ఆధారపడి ఉంటాయి. తరగతుల్లో చెప్పిన సమాచారం ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో కుంభమేళాలో విపత్తును గుర్తించడం, విపత్తు సమయంలో తక్షణ పరిష్కారం, మార్గాల గురించి సమాచారం, కుంభమేళా ఆధ్యాత్మిక, మతపరమైన సమాచారం, భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు.
ట్రైనింగ్ తో సంతోషంగా పోలీసులు
కుశినగర్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, శిక్షణ, పరీక్షల ద్వారా కుంభమేళా గురించి పూర్తిగా తెలిసిందని, ఇప్పుడు మేళా విధులకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ చౌబే మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చాక మహాకుంభ్ గురించి కొత్త విషయాలు తెలిసాయని, ఇవి విధుల్లో సహాయపడతాయని అన్నారు.
మహిళా కానిస్టేబుల్ స్వెత్లానా మౌర్య మాట్లాడుతూ, పోలీసులందరికీ ఈ విధంగా శిక్షణ ఇస్తున్నందున, మహాకుంభ్ మొదలైనప్పుడు అసలు పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతామని చెప్పారు.