Asianet News TeluguAsianet News Telugu

ఉపఎన్నికల బరిలో సీఎం వారసులు

కర్ణాటకలో ఉపఎన్నికల నగారా మోగడంతో ముఖ్యమంత్రి కుమార స్వామి ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నారు. కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కుమార స్వామి సీఎం పీఠాన్ని అధిరోహించారు. 

Kumaraswamy wife Anitha, son nikhil may be contest by elections
Author
Karnataka, First Published Oct 8, 2018, 3:17 PM IST

బెంగళూరు: కర్ణాటకలో ఉపఎన్నికల నగారా మోగడంతో ముఖ్యమంత్రి కుమార స్వామి ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నారు. కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కుమార స్వామి సీఎం పీఠాన్ని అధిరోహించారు. 

తక్కువ స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ పార్టీ అనూహ్య రాజకీయ పరిణామాలతో సీఎం పీఠం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంఖ్యను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం కుమార స్వామి. ప్రస్తుతం జరగనున్న మూడు ఎంపీ స్థానాలతోపాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. 

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఎంపీ స్థానాలు, 2అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో కుమార స్వామి పోటీకి రెడీ అవుతున్నారు. 

అయితే ఈ ఎన్నికల్లో ఆయన భార్య, కుమారుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమార స్వామి చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో గెలుపొందారు. రెండుచోట్ల కుమార స్వామి గెలుపొందడంతో రామ్ నగర్ స్థానానికి రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. 

సీఎం కుమార స్వామి ఇప్పటికే ఉపఎన్నికల బరిపై దృష్టిసారించడంతో ఇతర పార్టీలు సైతం అభ్యర్థులు వేటలో పడ్డాయి. బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. 

ఇకపోతే కుమారస్వామి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ రామ్‌నగర నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామిని బరిలోకి దించనున్నట్లు ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన మరుసటి రోజే అనిత కుమారస్వామి రామ్ నగర నియోజకవర్గంలో పర్యటించడం ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది.  

అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే అనిత పోటీపై జేడీఎస్‌ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చెయ్యలేదు. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. 

మరోవైపు జేడీఎస్‌ నేత సీఎస్‌ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నిఖిల్‌ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు. జాగ్వార్‌ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు నిఖిల్. 

అటు మాండ్యా లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో నిఖిల్ గెలుపు ఇక నల్లేరుమీద నడేకనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపాలని భావిస్తున్నారు. బళ్లారి లోక్ సభ స్థానంకు శ్రీరాములు రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.  

మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఎన్నికలు నిర్వహించి నవంబర్‌ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం​ ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios