Asianet News TeluguAsianet News Telugu

మీడియాను బాయ్ కాట్ చేస్తానన్న సీఎం

ఒకసారి మీడియాపై ఆంక్షలు పెడతారు. మరోసారి ఆ ఆంక్షలు ఎత్తివేసి దగ్గరకు చేర్చుకుంటారు. మళ్లీ అసహనం వ్యక్తం చేస్తారు. మీతో మాట్లాడను ఇక ప్రెస్మీట్లు పెట్టను అంటూ చిర్రుబుర్రులాడుతూ వెళ్లిపోతారు. ఇది ఎవరోకాదు కర్ణాటక సీఎం హెచ్.డీ.కుమారస్వామి తీరు వ్యవహారం. 

kumaraswamy says wont talk press again
Author
Bengaluru, First Published Nov 22, 2018, 10:22 PM IST

బెంగళూరు: ఒకసారి మీడియాపై ఆంక్షలు పెడతారు. మరోసారి ఆ ఆంక్షలు ఎత్తివేసి దగ్గరకు చేర్చుకుంటారు. మళ్లీ అసహనం వ్యక్తం చేస్తారు. మీతో మాట్లాడను ఇక ప్రెస్మీట్లు పెట్టను అంటూ చిర్రుబుర్రులాడుతూ వెళ్లిపోతారు. ఇది ఎవరోకాదు కర్ణాటక సీఎం హెచ్.డీ.కుమారస్వామి తీరు వ్యవహారం. 

గురువారం మీడియాతో మాట్లాడిన కుమార స్వామి కన్నడ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. ఇకపై మీతో మాట్లాడే ప్రసక్తే లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ వర్గం మీడియా తనను అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయితే సీఎం గారికి ఎందుకు చిర్రెత్తుకొచ్చిందని అనుకుంటున్నారా అందుకు ఓ కారణం ఉందండోయ్. చెరకు మద్దతు ధర పెంచాలంటూ కర్ణాటకలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న ఓ మహిళా రైతును అమ్మా.. మీరు ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నారు అంటూ కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలు మీడియాలో ప్రచారం కావడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు కుమారస్వామి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో జేడీఎస్‌ మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.

 ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శల దాడి చేసింది. దీంతో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌- కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ సిద్దరామయ్య రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడకు ఫోన్‌ చేసి పబ్లిక్‌ మీటింగుల్లో ఎలా మాట్లాడాలో కుమారస్వామికి చెప్పాలని సూచించారట కూడా. సిద్ధరామయ్య సలహా సీఎంకు చిర్రెత్తుకొచ్చినట్లైంది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి మీడియా కారణంగా నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. కావాలనే కొంతమంది నా గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. అవసరమనుకుంటే ఒక్కో మీడియా ప్రతినిధితో విడిగా మాట్లాడుతా అంతేగానీ ఇకపై పత్రికా సమావేశాలకు హాజరుకాను అంటూ చెప్పేశారు. 

మీకు ఇష్టమైతే రిపోర్టు చేసుకోండి లేకపోతే లేదు నేనేం అనుకోను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే సీఎం కుమార స్వామి మీడియాను దూరం పెట్టడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది మే నెలలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా విధానసభలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ విషయమై విమర్శలు రావడంతో జూలైలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios