బెంగుళూరు:కర్ణాటకలో  రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వంపై అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహలతో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ శక్తియుక్తులను ఉపయోగిస్తోంది.

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకొంటారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సరైన పార్మెట్‌లో లేవని ప్రకటించారు. 

 ప్రభుత్వం మైనార్టీలో పడినందున ముఖ్యమంత్రి పదవికి  కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఈ విషయమై విధానసభలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగనున్నట్టు బీజేపీ ప్రకటించింది.

కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు గోవా హోటల్‌లో బస చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవని స్పీకర్ రమేష్ ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలను ఈ నెలలో కలవాలని  కోరారు.

అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను  ఆమోదించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. స్పీకర్ ను కలిసేందుకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలకు స్పీకర్  అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.  రాజీనామాలు చేసిన  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  స్పీకర్ ను కలిసి  రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని  కోరారు.