వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమే తమ లక్ష్యమన్నారు జేడీఎస్ అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. శుక్రవారం విజయవాడ పర్యటనకు వచ్చిన కుమారస్వామి గేట్‌వే హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జేడీఎస్ అధినేత మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు.. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చ జరిగినట్లు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. తెలుగుదేశం పార్టీతో తమది సోదర బంధమని.. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.. దీనిలో భాగంగా ఇప్పటికే పలు పార్టీలతో చర్చలు జరిపామని... ఇవాళ్టీ భేటీ కూడా దానికి కొనసాగింపని స్పష్టం చేశారు. అయితే ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ముఖ్యం కాదని.. ఆ విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని కర్ణాటక సీఎం తెలిపారు. 

కాగా, వీరిద్దరి భేటీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ విధానాలను విభేదించి ఎన్డీఏ నుంచి వైదొలిగిన చంద్రబాబును ఎలాగైనా యూపీఏలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సానుకూలంగానే ఉన్నట్లుగా ప్రస్తుత రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. దీనిలో భాగంగా రాహుల్ దూతగానే కుమారస్వామి టీడీపీ అధినేతను కలిసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.